Kesineni Nani: ఉర్సా క్లస్టర్స్ కు భూకేటాయింపు.. కేశినేని నాని సంచలన ఆరోపణలు

విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Ursa clusters pvt ltd) అనే సంస్థకు భూమి కేటాయింపు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దాదాపు 60 ఎకరాల భూమిని ఈ సంస్థకు అతి తక్కువ ధరకే కేటాయించినట్లు వచ్చిన వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్ర ఆరోపణలు చేస్తూ, దీనిని భారీ భూకుంభకోణంగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Shivanath – Chinni)పై సంచలన ఆరోపణలు చేశారు. ఉర్సా క్లస్టర్స్ వెనుక చిన్ని హస్తం ఉందని, ఈ కేటాయింపుపై పునరాలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేశ్‌లకు (Nara Lokesh) సూచించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. దీనికి విశాఖపట్నంలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ గురించి స్పష్టమైన నేపథ్యం లేకపోవడం, కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఈ కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో భూమిని అతి తక్కువ ధరకు కేటాయించడం విమర్శలకు దారితీసింది. భూకేటాయింపుల వెనుక ప్రభుత్వంలోని కొందరు పెద్దల కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకత పాటించలేదని విమర్శించింది.
ఈ వివాదంపై మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉర్సా క్లస్టర్స్ సంస్థ వెనుక చిన్ని బినామీలు ఉన్నారని, ఈ సంస్థలో అబ్బూరి సతీష్‌తో (Abburi Satish) కలిసి చిన్ని భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. గతంలో 21 సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్ (21st century investment properties) పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన చరిత్ర చిన్నికి ఉందని నాని గుర్తు చేశారు. ఈ భూకేటాయింపు వ్యవహారంలో చిన్ని ప్రమేయం ఉందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికాలో ఇది పేరొందిన డేటా సెంటర్ నిర్వహిస్తోందని, ఇండియాలో కార్యకలాపాలకోసం ఇటీవలే సంస్థ రిజిస్టర్ చేసుకుందని కొందరు చెప్తున్నారు. అందుకే ఈ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయించినట్లు ప్రభుత్వ పెద్దలు సమర్థించుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ ప్రజల ముందుంచడం ద్వారా ప్రభుత్వం విమర్శల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకుంటే ఏదో జరుగుతోందనే అనుమానాలు మరింత బలపడే ప్రమాదం ఉంటుంది.