నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమవుతున్నారా…?
నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయన తర్వాత నందమూరి ఫ్యామిలీ తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీగా ఉంది. అయితే నందమూరి ఫ్యామిలీలోని విభేదాలు అడపాదడపా ఆ కుటుంబాన్ని వార్తల్లో ఉంచుతున్నాయి. తాజాగా మరోసారి ఇదే అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక రూ.100 నాణెం ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం చర్చకు దారితీస్తోంది.
నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినీరంగంలో టాప్ హీరోగా ఉంటున్నారు. ఆయనుకున్న క్రేజ్ అలాంటిది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని, టీడీపీలో యాక్టివ్ కావాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. అయితే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర రోజురోజుకూ పరిమితం అయిపోతోంది. తండ్రి నందమూరి హరికృష్ణ ఉన్నంతకాలం జూనియర్ ఎన్టీఆర్ కు కుటుంబంలో ప్రత్యేక ప్రయారిటీ ఉండేది. అయితే హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబానికి దూరమవుతూ వస్తున్నారు. అంతకుముందు అంతంతమాత్రంగానే ఉన్న కల్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ సంబంధాలు ఈ మధ్య బాగా బలపడ్డాయి. అన్నదమ్ములిద్దరూ ఒకేతాటిపై నడుస్తున్నారు.
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయన ముఖచిత్రంతో రూ.100 నాణెం రూపొందించారు. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రారంభించారు. ఎన్టీఆర్ కుటుంబమంతా ఈ కార్యక్రమానికి హాజరైంది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ ను కూడా దీనికి ఆహ్వానించారు. అయితే వీళ్లిద్దరూ హాజరు కాలేదు. దేవర సినిమాలో బిజీగా ఉండడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారని చెప్తున్నారు. అయితే తాత ఎన్టీఆర్ అంటే చెవికోసుకునే జూనియర్.. ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమానికి డుమ్మా కొట్టడం విమర్శలకు దారితీస్తోంది. తనంతట తానే ఎన్టీఆర్ కుటుంబానికి దూరం జరుగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో నిమ్మకూరులో జరిగిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదని తెలుగుదేశం పార్టీపై ఆయన అభిమానులు పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. టీడీపీ నేత టీడీ జనార్ధన్ తో పాటు జయకృష్ణ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. అయినా ఆ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ నాణెం ప్రారంభోత్సవానికి కూడా జూనియర్ డుమ్మా కొట్టారు. ఇటీవల సుహాసిని కుమారుడి పెళ్లికి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమవుతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.













