ఏపీ అంటే అప్పుల ప్రదేశ్‌గా : జయప్రద
ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో బీజేపీ గోదావరి గర్జన సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి జేపీ నడ్డా ఇక్కడి వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పనిచేయలేదన్నారు. ఏపీలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారు, కానీ పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అన్నదాత సుఖంగా ఉన్నారా, అన్నం లేకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆడపిల్ల బయటకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే వరకు తల్లి గడప దగ్గర కాచుకొని కూర్చుంటుందని అన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. బీజేపీ గర్జనకు మద్దతిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బీజేపీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.













