Jagan: జీఎస్టీ-2.0 పై జగన్ ట్వీట్.. మోడీ నిర్ణయానికి స్వాగతం..

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ (GST) రెండవ తరం సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మోడీ (Narendra Modi )ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల సాధారణ కుటుంబాలకు నేరుగా మేలు చేకూరుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
జగన్ తన ట్వీట్‌లో ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. పన్నుల విధానం మరింత సులభంగా, న్యాయబద్ధంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త సంస్కరణలు వస్తున్నప్పుడు కొన్ని ఫిర్యాదులు రావడం సహజమని కానీ, ఇది ఒక ప్రక్రియలో భాగమని జగన్ అన్నారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి వినియోగదారుడికి కూడా ఈ ప్రయోజనాలు చేరతాయని జగన్ పేర్కొన్నారు.
ఇక జగన్ స్పందన ఆలస్యంగా వచ్చిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. జీఎస్టీ పన్ను తగ్గింపుల విషయం దేశవ్యాప్తంగా పది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ స్పందనను ప్రకటించాయి. కూటమి పక్షాలు ఈ నిర్ణయాన్ని ఘనంగా స్వాగతించాయి. వైసీపీ మాత్రం మౌనం ఎందుకు పాటిస్తోందని కొందరు ప్రశ్నించారు. అయితే జగన్ ఈరోజు, అమలు మొదలైన రోజునే తన అభిప్రాయాన్ని చెప్పడం విశేషంగా మారింది.
ప్రతిపక్ష పార్టీలు జీఎస్టీ సంస్కరణలను స్వాగతించడమే కాకుండా, కేంద్రంపై విమర్శలు కూడా గుప్పించాయి. అయితే జగన్ మాత్రం ఎలాంటి రాజకీయ కోణం లేకుండా, నేరుగా మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే అని తెలిపారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి వాదనలకు తావు ఇవ్వకుండా, ప్రజలకు ఉపయోగకరమైన అంశం కాబట్టి సానుకూలంగా స్పందించారు.
జీఎస్టీ రెండవ దశ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తెచ్చిన చర్యలు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి ఎన్డీయే (NDA) మిత్రపక్షాలతో పాటు వైసీపీ కూడా స్వాగతం పలకడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జగన్ వ్యాఖ్యలతో ఈ సంస్కరణలు రాష్ట్రంలో కూడా సానుకూలంగా స్వీకరించబడుతున్నాయనే భావన కలిగింది.
సాధారణ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు , మధ్యతరగతికి ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు. పన్నుల తగ్గింపు వల్ల వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉండటంతో గృహిణుల నుంచి చిన్న వ్యాపారులు వరకు అందరూ ఉపశాంతిని పొందవచ్చు. జగన్ రియాక్షన్ ఆలస్యమైనా సరే, లేటెస్ట్‌గా ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాటలతో వైసీపీ కూడా జీఎస్టీ సంస్కరణలకు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది.