Jagan: అనారోగ్య సమస్యల వల్ల క్రిస్మస్ వేడుకలకు దూరంగా జగన్..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y.S. Jagan Mohan Reddy) అనారోగ్యానికి గురికావడంతో ఆయన నేటి పులివెందుల (Pulivendula) పర్యటనలోని అన్ని కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతున్నారని, వైద్యుల సూచనల మేరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ముందుగా ఖరారైన కార్యక్రమాలను వాయిదా వేయనున్నట్టు సమాచారం. బెంగళూరు (Bengaluru) నుంచి మంగళవారం పులివెందులకు చేరుకున్న జగన్, మూడు రోజుల పాటు అక్కడే ఉండి క్రిస్మస్ (Christmas) వేడుకల్లో పాల్గొనాలని భావించారు.
క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో పలు ఆధ్యాత్మిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే షెడ్యూల్ ఆయనకు ఉంది. అయితే అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వైద్యుల సలహా మేరకు ఈ రోజు జరిగే అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ అధికారిక ఎక్స్ (X) వేదిక ద్వారా వెల్లడించింది. జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వాస్తవానికి పులివెందుల పర్యటనలో భాగంగా ఇడుపులపాయ (Idupulapaya)లో ప్రార్థనల్లో పాల్గొనడం, అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి కార్యక్రమాలు షెడ్యూల్లో ఉన్నాయి. కానీ అనారోగ్యం కారణంగా ఇవన్నీ తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఆరోగ్యం మెరుగుపడితే రేపు పులివెందుల సీ.ఎస్.ఐ. చర్చి (CSI Church)లో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం పులివెందులకు చేరుకున్న వెంటనే ఆయనకు పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలతోనూ ఆయన స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. సాయంత్రం 3:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పట్ల ఆయన చూపిన స్పందనకు హాజరైన వారు హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, లాంచ్ వెహికల్ మార్క్-3 ఎం6 (LVM3-M6) రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం దేశ శాస్త్రీయ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశానికి స్ఫూర్తిగా నిలుస్తూ నిరంతరం శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషి ప్రశంసనీయమని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో జగన్ కొనియాడారు. మొత్తానికి ఈ క్రిస్మస్ కి జగన్ వేడుకలు ట్విట్టర్ కే పరిమితం అయ్యేలా ఉన్నాయి.






