ఈ నెల 24న ఏపీ బంద్
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ, లోక్‌సభలో పరిణామాలపై జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా తాము మాట్లాడుతుంటే హేళన చేశారన్నారు. హోదా ఏమన్నా సంజీవనా అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అవసరం లేదని మహానాడుతో తీర్మానం చేశారని తెలిపారు. ప్యాకేజీ ప్రకటించిన అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారని, ప్యాకేజీ బాగుంది అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తే దేశమంతా తమవైపే చూసేదని, కానీ చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదని మండిపడ్డారు. బీజేపీతో యుద్దమంటూనే లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హోదా వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు. టీడీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి దీక్షలకు కూర్చోవాలని, 25 మంది ఎంపీలు కలిసి పోరాడితేనే ప్రత్యేక హోదా వస్తుందని జగన్ పిలుపునిచ్చారు.













