ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగన్
విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ విద్యా హక్కును అందించాలన్న తమ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్లకు ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భావి పౌరులకు విద్య, విజ్ఞానాన్ని అందించి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నైతిక విలువలే పునాదులుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు వందనం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.













