కేంద్ర ప్రభుత్వం నిధులను దారి మళ్ళించిన జగన్.. అస్తవ్యస్తంగా ఆంధ్ర ప్రాజెక్టులు..
జగన్ ప్రభుత్వం పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గ్రామీణ, పట్టణాభివృద్ధికి నిధులు దారి మళ్ళించబడ్డాయి. కేంద్రం తన వాటాగా రాష్ట్రాలలో పాటించాల్సిన వివిధ పథకాలకు సంబంధించి విడుదల చేసిన నిధులను జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంది. ఫలితంగా వైసీపీ హయాంలో ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పనులు అరాకొరా పూర్తి చేయబడ్డాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన పనులు పూర్తి చేయడం టీడీపీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
స్థానిక సంస్థల్లో పూర్తికాకుండా నిలిచిపోయిన పట్టణ అభివృద్ధి పనులు ముందుకు సాగాలి అంటే సుమారు రూ.5,192 కోట్లు ఖర్చవుతాయి. మరోవైపు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు కొనసాగాలి అంటే మరొక 5,500 కోట్లు కావాలి.. గత బుధవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశమైనా చంద్రబాబు కేంద్రం కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిన విషయంపై ప్రస్తావించారు. మరోపక్క ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీ లను అడుగుతోంది. జగన్ ప్రభుత్వం ఐదేళ్ల నిర్వాకంతో కొత్తగా రుణాలు తీసుకోవాలన్న ఎక్కడలేని నిబంధనలు అడ్డొస్తున్నాయి అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి పథకాలకు కేంద్రం కేటాయించిన నిధులను జగన్ పూర్తిగా వాడేసారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమృత్ పథకం.1.0, 2.0 కింద లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం కోసం రూ.1,639.43 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో రూ.840.67 కోట్లు మాత్రమే విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన రూ.798.76 కోట్లు దారి మళ్లించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన రూ.574.71 కోట్లు నిధులను కూడా ఇవ్వలేదు. ఈ కారణంగా మన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగుల్లో ఉన్నాయి. ఇది మచ్చుకి ఒకటి మాత్రమే.. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో అంటున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఉన్న ప్రాజెక్టులు కొనసాగాలన్నా.. కొత్తవి రావాలన్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు అన్న విషయం సర్వత్ర చర్చనీయాంసంగా మారింది.













