బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా..?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీల మధ్య అవగాహన ఏర్పడడంతో కలిసి పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ఓట్ షేర్ కూడా బీజేపీ కంటే ఎక్కువే. దీంతో తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో జనసేనే పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు బలంగా భావించాయి. అయితే పెద్దల ఒత్తడి మేరకు ఆ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది జనసేన.
అయితే తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ బలముందని ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీ శ్రేణులు సహకరించలేదనే అసంతృప్తి జనసేన శ్రేణుల్లో ఉంది. అందుకే గెలవాల్సిన స్థానాలను కూడా కొన్నిచోట్ల కోల్పాయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల బీజేపీ వల్ల చాలా నష్టపోయామని బాధపడుతున్నారు. విజయవాడలో అయితే ఏకంగా బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్ వినిపించింది.
తిరుపతి సీటును వదులుకోవడానికి జనసేన అధిష్టానం కూడా గట్టిగానే పట్టుబట్టింది. చివరి వరకూ సీటుకోసం పోరాడింది. అయితే ఢిల్లీలోని కమలం పెద్దల ఒత్తిడితో పవన్ కల్యాణ్ సీటును బీజేపీకి వదిలేశారు. అయితే ఆ పార్టీ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండట్లేదని.. తమ మాటకు విలువ ఇవ్వట్లేదని కొంతమంది జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే తిరుపతి స్థానంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని మాటమాత్రంగా ఓ ప్రకటన విడుదల చేయాలనుకుంటోంది జనసేన. తిరుపతిలో ప్రచారానికి పవన్ కల్యాణ్ కూడా దూరంగా ఉండబోతున్నారనే టాక్ జనసేన శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.
జనసేన దూరంగా ఉంటే బీజేపీ సత్తా ఏంటో కూడా తెలిసొస్తుందని.. అందుకే తిరుపతి ఎన్నికకు పవన్ దూరంగా ఉంటేనే మేలని జనసేన నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే పవన్ లేకుండా ఈ ఎన్నికల్లో సత్తా చాటడం కష్టమనే ఫీలింగ్ బీజేపీ నేతల్లో ఉంది. అందుకే ఎలాగైనా పవన్ కల్యాణ్ ను ప్రచారానికి తీసుకురావాలనే ఆలోచనలోఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థి వేటలోనే ఉంది. మరి అభ్యర్థిని ఎప్పుడు ఖరారు చేస్తుంది.. జనసేన సహకరిస్తుందా.. లేదా హ్యాండ్ ఇస్తుందా.. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.













