Siddharth Kaushal: ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా… అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లో 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ (Siddharth Kaushal IPS) స్వచ్ఛందంగా తన పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేపుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆయన, బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన, తన రాజీనామాకు ప్రభుత్వ ఒత్తిళ్లు లేవని, తన ఇష్టప్రకారమే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. అయినప్పటికీ, రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల పలువురు ఐఏఎస్ (IAS) లు, ఐపీఎస్ (IPS) లపై చట్టవ్యతిరేక ఆరోపణలు వచ్చాయి. జగన్ (YS Jagan) హయాంలో పలువురు అధికారులు చట్టవ్యతిరేకంగా వ్యవహరించారంటూ కొందరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వాళ్లు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇది అధికారుల్లో చర్చనీయాంశంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పాలకులు చెప్పినట్లు నడుచుకున్న అధికారులు ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి టీడీపీ (TDP) ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన ఉంది. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని కొందరు అంటున్నారు. అలా చేస్తే అధికారులు ఎందుకవుతారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకు ప్రభుత్వ ఒత్తిడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఆరోపించింది. చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ కౌశల్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన రాజీనామాకు కారణాలను అందులో వివరించారు. “ఇటీవల కొన్ని వార్తలు నా రాజీనామాను తప్పుడు కారణాలను జోడిస్తున్నాయి. అవి పూర్తిగా అసత్యమైనవి, తప్పుడు ఆరోపణలు. నా నిర్ణయం పూర్తిగా స్వచ్ఛందం, వ్యక్తిగతం” అని ఆయన పేర్కొన్నారు. ఐపీఎస్‌లో ఉన్న కాలం జీవితంలో అత్యంత సంతృప్తికరమైనదని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సేవ అత్యంత ప్రత్యేకమైనదని అన్నారు. “ఆంధ్రప్రదేశ్‌ను నా ఇంటిలా భావించాను. ఇక్కడి ప్రజలు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతారు,” అని ఆయన కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీనియర్లు, కో-వర్కర్లు, పౌరులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నానని, సదుద్దేశ్యంతోనే ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. సమాజానికి కొత్త రీతుల్లో సేవ చేయాలని ఆలోచిస్తున్నానని సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. దీంతో ఆయన రాజీనామా వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉందనే ఊహాగానాలకు తెరపడినట్లయింది.
సిద్ధార్థ్ కౌశల్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రకాశం, కృష్ణా, కడప జిల్లాల ఎస్పీలుగా పని చేశారు. ప్రజలతో చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించారు. ఆయన పనితీరును గుర్తిస్తూ పలు అవార్డులను కూడా దక్కించుకున్నారు. అతనిపై ఎలాంటి అవినీతి, చట్టవ్యతిరేక ఆరోపణలు కూడా లేవు. ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఆయన్ను విధుల నుంచి పక్కన పెట్టిన సందర్భాలు కూడా లేవు. ఆయన ప్రస్తుతం డీజీపీ ఆఫీసులోనే పని చేస్తున్నారు. దీంతో ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉందనే ఆరోపణలు సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. బహుశా ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసి ఉండొచ్చని చెప్తున్నారు.