పెట్టుబడులకు ఏపీ అనుకూలం
వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయ విధానాలను అమలు చేస్తోందని తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రం వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తోందని, రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) వంటి కొత్త ఆవిష్కరణలతో వివిధ ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించగలుగుతున్నారని వివరించారు. సలువైన వ్యాపార అనుకూలతల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన ప్రస్తావించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులను వీలున్న పరిస్థితులు, ఇతర అనుకూలతలపై పరిశీలన, ప్రచార నిమిత్తం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎంపిక చేసిన వివిధ దేశాల్లోని భారత రాయబారుల బృందం రెండు రోజుల ఆంధ్రప్రదేశ్లో పర్యటనకు వచ్చింది. అంతకుముందు ఆ బృందం హైదరాబాద్లో గవర్నరును కలిసింది. గవర్నరును కలిసిన వారిలో స్పెయిన్, వియత్నాం, కువైట్లో భారత రాయబారుడు డి.బాల వెంకటవర్మ, పి.హరీశ్, కె.జీవసాగర్ ఉన్నారు.













