Pawan Kalyan : భీమవరంలో పవన్ మాటే శాసనం..!
రాజకీయాల్లో మాట చెల్లుబాటు కావడం అనేది నాయకుడి పట్టుకు నిదర్శనం. అందులోనూ కూటమి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు బడా నేతల మధ్య ఒక అధికారి విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు.. అంతిమ విజయం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన అధికారిని వెనకేసుకొచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పవన్ కళ్యాణ్ పంతమే నెగ్గింది. డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడటంతో కూటమి ప్రభుత్వంలో జనసేనాని మాటకు ఉన్న విలువేంటో మరోసారి స్పష్టమైంది.
ఈ వివాదానికి మూలం గతేడాది అక్టోబర్ మూడో వారంలో పడింది. అప్పటి భీమవరం డీఎస్పీ జయసూర్య పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం అసహనంతో సరిపెట్టకుండా, నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి, ఆ వెంటనే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫోన్ చేసి మరీ క్లాస్ పీకారు. డీఎస్పీ జయసూర్య వ్యవహారశైలిపై తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా మూడు ప్రధాన ఆరోపణలను పవన్ ప్రస్తావించారు. డీఎస్పీ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారికి అండగా నిలుస్తున్నారని, పోలీసుల పని విడిచిపెట్టి, సివిల్ తగాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం, ఒక డీఎస్పీపై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీఎస్పీపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అంతా భావించారు. కానీ, ఇక్కడే సీన్లోకి డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన డీఎస్పీ జయసూర్యకు రఘురామ బహిరంగంగా మద్దతు పలికారు. “ఆయన మంచి అధికారి.. ఎవరో చెప్పిన మాటలు నమ్మి పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డారు తప్ప, ఆ అధికారి తప్పు లేదు” అంటూ క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. విచారణ జరిపితే వాస్తవాలు తెలుస్తాయని, డీఎస్పీ మంచివాడేనని తేలుతుందని రఘురామ నమ్మకంగా చెప్పారు.
దీంతో ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామ అన్నట్టుగా మారింది. సొంత నియోజకవర్గ పరిధిలోని అధికారిని కాపాడుకోవాలని రఘురామ, తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని పవన్.. ఇలా ఇద్దరు అగ్రనేతలు పరోక్షంగా ఒక అధికారి కోసం పట్టుదల ప్రదర్శించినట్లయింది.
రెండు నెలల ఉత్కంఠ తర్వాత, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎన్ని కితాబులు ఇచ్చినా, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఆదేశాలకే ప్రాధాన్యత ఇచ్చింది. డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలోకి రఘువీర్ విష్ణును కొత్త డీఎస్పీగా నియమించింది. ఇది సాధారణ పరిపాలనాపరమైన బదిలీ అని పైకి కనిపిస్తున్నా, దీని వెనుక పవన్ కళ్యాణ్ పట్టుదల ఉందన్నది కాదనలేని సత్యం.
ఈ బదిలీ వ్యవహారం కేవలం ఒక అధికారి మార్పు మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వంలో అధికార సమతుల్యతకు, పవన్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన మిత్రపక్ష నేతలు సిఫార్సు చేసినా సరే, అవినీతి లేదా విధి నిర్వహణలో అలసత్వం ఉంటే సహించేది లేదని ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు. హోం శాఖ వేరే వారి చేతిలో ఉన్నా, లేదా డీజీపీ స్థాయి అధికారులు ఉన్నా.. లా అండ్ ఆర్డర్ విషయంలో, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే విషయంలో తానే సుప్రీం అని పవన్ నిరూపించుకున్నారు. డీజీపీకి ఫోన్ చేసిన వెంటనే ఫలితం రావడం దీనికి నిదర్శనం.
ఇక నిత్యం వార్తల్లో ఉండే రఘురామ కృష్ణంరాజుకు ఈ పరిణామం కాస్త ఇబ్బందికరమే. తాను వెనకేసుకొచ్చిన అధికారిని ప్రభుత్వం బదిలీ చేయడం ద్వారా, స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు కంటే డిప్యూటీ సీఎం ఆదేశమే ఫైనల్ అని ప్రభుత్వం తేల్చి చెప్పినట్లయింది. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చడంపై పవన్ మొదటి నుంచి సీరియస్ గా ఉన్నారు. భీమవరం డీఎస్పీ బదిలీ ద్వారా రాష్ట్రంలోని మిగిలిన పోలీసు అధికారులకు కూడా బలమైన సంకేతం వెళ్ళింది. సెటిల్మెంట్లు చేస్తే.. ఎంతటి వారి మద్దతు ఉన్నా ఇంటికి వెళ్లాల్సిందే అనే మెసేజ్ క్లియర్ గా పాస్ అయ్యింది.
మొత్తానికి భీమవరం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తన పంతం నెగ్గించుకున్నారు. తద్వారా కూటమి ప్రభుత్వంలో తన మాటే శాసనం అని, ప్రజా సమస్యలు, అవినీతి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కొత్తగా వచ్చిన డీఎస్పీ రఘువీర్ విష్ణు అయినా పవన్ ఆశించినట్లుగా, వివాదాలకు తావివ్వకుండా పని చేస్తారో లేదో చూడాలి. ఏది ఏమైనా, ఈ బదిలీ ఏపీ పోలీసు వర్గాల్లో ఒక కుదుపు అని చెప్పక తప్పదు.






