పిఠాపురంలో హై టెన్షన్..
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాకాండ అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరి మీద దాడులు జరుగుతాయో అన్న భయాందోళనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి కాకినాడ జిల్లాలో ఎక్కువగా కనబడుతోంది. జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో పోలీస్ శాఖ ఒకసారిగా అప్రమత్తమైంది.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడ కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ శాఖ చాలా స్పష్టంగా నివేదిక అందజేసింది. సాధారణంగా మిగతా నియోజకవర్గాలలో గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ గెలుపు ప్రధాన పక్షాలకు పరువు, ప్రతిష్టల సమస్యగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని జనసేన, ఆరు నూరైనా జనసేనను ఓడించాలని వైసిపి పిఠాపురంలో సర్వశక్తులు ఒడ్డాయి. రెండు పార్టీలు తాడోపేడో తేల్చు కుందామని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు. అయినప్పటికీ అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న ఘటనలు ఇక్కడ కూడా జరిగే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా పిఠాపురంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసిపి బ్లేడు బ్యాచులు గంజాయి బ్యాచ్ లను దింపిందని జనసేన నేతలు ఆరోపించారు. వీరితో పాటు రాయలసీమ నుంచి రౌడీ మూకలను మాఫియా ముఠాలను పిఠాపురంలో దింపారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రకటన చేశారు. వైసిపి గెలవలేని పరిస్థితుల్లో పిఠాపురంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలింగ్ ముగిసిందని రిలాక్స్ అవ్వకుండా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద జనసైనికులు అప్రమత్రంగా ఉండాలని పిలుపు నిచ్చారు కూడా.. ఆ క్రమంలో ఓటమి జీర్ణించుకోలేక ఎవరైనా దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న పిఠాపురంలో భయానక వాతావరణం సృష్టించి ఈ నియోజకవర్గంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అరాచక శక్తులను సంఘవిద్రోహులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సమయాల్లో దరిదాపుల్లోకి రానివ్వమని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. అవసరం అయితే ముందుగానే బైండోవర్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని రౌడీషీటర్లకు వార్నింగ్ ఇస్తున్నారు.
అలాగే కఠినమైన నిబంధనలు కూడా అమలులోకి తీసుకొచ్చారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదని ప్రకటించారు. ముఖ్యంగా బాటిళ్లలో పెట్రోలు పోయకూడదని బంకులకు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ పూర్తి అయిన వారం రోజుల వరకు సెక్షన్ 144 కూడా అమలులో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఇంటలిజెన్స్ రిపోర్ట్లతో అలెర్ట్ అయ్యారు .. కోనసీమలో ఇటీవల జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఆయా నియోజకవర్గాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.













