Amaravati: అమరావతిని అడ్డుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ రాజధాని నగరం (Capital City) మాత్రం లేదు. విభజన తర్వాత మొదట అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని (Amaravati) రాజధానిగా ప్రకటించింది. దీన్ని ప్రపంచంలోనే అత్యాధునిక రాజధాని నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. అయితే ఆ పార్టీ అనుకున్నట్టు అన్నీ జరగలేదు. 2019లో టీడీపీ (TDP) ఓడిపోయింది. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చింది. అమరావతితో పాటు మూడు రాజధానులు ( 3 capitals) ఉండాలని తీర్మానించింది. అయితే వాటిని సాకారం చేయడంలో వైసీపీ విఫలమైంది. ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కొంతమంది అమరావతిని మళ్లీ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు.
వైసీపీ తెరపైకి తెచ్చిన మూడు రాజధానులను టీడీపీ, జనసేన, బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇప్పుడు ఆ మూడు పార్టీలూ అధికారంలో ఉండడంతో అమరావతిని పూర్తిస్థాయిలో నిర్మించాలని తలపెట్టాయి. అందుకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమరావతి నిర్మాణాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నాయి. వచ్చే నెలలో అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన రుణాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంకు (World Bank) కూడా అంగీకరించింది.
అమరావతికి రూ.13500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది. అయితే అమరావతికి రుణం ఇవ్వొద్దని కోరుతూ కొంతమంది ఈ నెల 18న ప్రపంచబ్యాంకుకు ఆకాశ రామన్న ఉత్తరం (Ghost Letter) రాశారు. వాస్తవానికి 2016-17 మధ్యకాలంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు.. రైతుల నుంచి భూసేకరణ చేసినప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు, కొన్ని ఎన్జీవోలు, కొన్ని ప్రజాసంఘాలు కూడా ఇదే తరహాలో ప్రపంచబ్యాంకుకు లేఖలు రాసి అమరావతికి నిధులు రాకుండా అడ్డుకున్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో లేఖలు రాయడం మొదలు పెట్టాయి.
అమరావతికి రైతుల నుంచి భూములు సేకరించడం చట్ట వ్యతిరేకం అని., పర్యావరణానికి హాని కలుగుతుందని.. అమరావతిని హైకోర్టు అంగీకరించలేదని.. రైతులు కూడా అమరావతిని వ్యతిరేకిస్తూ ఏడాదికి పైగా ఉద్యమించారని.. ఇలా అనేక అంశాలను ఈ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి రైతులు స్వచ్ఛంధంగా అమరావతికి భూములిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని కాదని మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఏడాదికి పైగా ఉద్యమించారు. కానీ లేఖలో మాత్రం వాస్తవ విరుద్ధంగా అవాస్తవాలను క్రోఢీకరించారు. గతంలో లాగే ఇప్పడు కూడా అమరావతిని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే రాజధాని లేక సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













