GV Reddy: టీడీపీకి బిగ్ షాక్.. జీవీ రెడ్డి రాజీనామా..!!
ఆంధ్రప్రదేశ్ (AP) లో తెలుగుదేశం పార్టీ (TDP) అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. పైగా కనీవినీ ఎరుగని మెజారిటీతో ఆ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీలోకి చేరేందుకు నేతలందరూ తహతహలాడుతుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా వైసీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరేందుకు ఎదురు చూస్తుంటారు. అవకాశం ఇస్తే చాలనుకుంటున్నారు. కానీ టీడీపీలో ఓ కీలక నేత మాత్రం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత ఇచ్చిన పదవిని కూడా వదులుకున్నారు. ఆయన జీవీ రెడ్డి (GV Reddy). పార్టీ అధికార ప్రతినిధి.
జీవీ రెడ్డి పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ పార్టీలో (Congress) రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వెంకట్ రెడ్డి ఆ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన వెంకట్ రెడ్డి (G Venkat Reddy) ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. మీడియాను ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన వెంకట్ రెడ్డిని అధికార ప్రతినిధిగా (Official Spokes Person) నియమించింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ (Fibrenet Corporation Chairman) గా నియమించింది. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఫైబర్ నెట్ ను సంస్కరించాలని జీవీ రెడ్డి ప్రయత్నించారు.
ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వెంకట్ రెడ్డి అందులో జరిగిన అవకతవకలను బయటపెట్టారు. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఆయన పనితీరును అందరూ మెచ్చుకున్నారు. అయితే కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నా తను ఏమీ చేయలేకపోతున్నానని.. ఎండీ దినేశ్ కుమార్ తో పాటు మరికొంతమంది అధికారులు అస్సలు మాట వినట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పెద్ద సంచలనం రేపింది.
వెంకట్ రెడ్డి ఆరోపణలపై స్పందించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఎండీ సహా అధికారులతో మాట్లాడారు. నివేదిక ఇవ్వాలని కోరారు. ఇంతలో టీడీపీ అధినేత చంద్రబాబు.. వెంకట్ రెడ్డిని పిలిపించుకుని మందలించినట్లు సమాచారం. ఐఏఎస్ అధికారులపై మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించినట్లు తెలిసింది. తాను వాస్తవాలను చెప్పినా అధినేత వినిపించుకోకుండా అధికారులను సమర్థించడంపై జీవీ రెడ్డి అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన టీడీపీకి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా (GV Reddy Resign) చేశారు. ఇకపై తాను పూర్తిగా న్యాయవాద వృత్తికే పరిమితమవుతానని, ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని ఆయన లేఖలో పేర్కొన్నారు. జీవీ రెడ్డి లాంటి సమర్థుడైన నేతను పోగొట్టుకోవడం టీడీపీకి కచ్చితంగా లోటేనని చెప్పొచ్చు.













