GV Reddy: జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం… చంద్రబాబు పై తెలుగు తమ్ముళ్లు ఫైర్..!!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా (GV Reddy resign) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఫైబర్ నెట్ ఛైర్మన్ (Fibre Net corporation Chairman) పదవితో పాటు టీడీపీ (TDP) ప్రాథమిక సభ్యత్వానికి, అధికార ప్రతినిధి (Official Spokes Person) హోదాకు కూడా జీవీ రెడ్డి రాజీనామా చేసేశారు. టీడీపీ అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమోదించేసింది. అయితే ఈ వ్యవహారంలో టీడీపీ హైకమాండ్ తీరుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. జీవీ రెడ్డి వైపే 99 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. జీవీ రెడ్డి రాజీనామా విషయంలో చంద్రబాబు తప్పు చేసారని.. ఇలాంటి వాళ్లను పోగొట్టుకోవడం పార్టీకి మంచిది కాదని సూచిస్తున్నారు.
ఫైబర్ నెట్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందులోని అవకతవకలపై దృష్టి పెట్టారు జీవీ రెడ్డి. దాన్ని ప్రక్షాళన చేయాలని తలపెట్టారు. అయితే తన ప్రయత్నాలకు అడుగడుగునా బ్రేకులు వేస్తూ వచ్చారు ఎండీ దినేశ్ కుమార్ (MD Dinesh Kumar). ఎంతగా చెప్పి చూసినా వాళ్లు కేర్ చేయలేదు. దీంతో జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైబర్ నెట్ లో ఏం జరుగుతోందో బయటపెట్టారు. ఐఏఎస్ అధికారిపైనే జీవీ రెడ్డి అలా మాట్లాడడంతో అధికారుల సంఘం అభ్యంతరం తెలిపింది. వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లింది. జీవీరెడ్డిని పిలిపించి చంద్రబాబు మందలించారు. ఇంకోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఓ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టడమే నేరమా అని జీవీ రెడ్డి ఆవేదన చెందారు. అందుకే ఇలా సర్దుకుపోవడం కంటే రాజకీయాలు వదిలేసి న్యాయవాద వృత్తి చేసుకోవడమే బెటర్ అనుకున్నారు. వెంటనే రాజీనామా చేసేశారు. పార్టీ కూడా ఆమోదించేసింది. అయితే టీడీపీ కేడర్ మొత్తం జీవీ రెడ్డికి అండగా నిలుస్తోంది. పార్టీ హైకమాండ్ జీవీ రెడ్డి ఇష్యూపై పునరాలోచించాలని సూచిస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో ఇలాంటి నేతలను వదులుకుంటే పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో జీవీ రెడ్డికి అనుకూలంగా కుప్పలుతెప్పలుగా మెసేజ్ లు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవంకోసం పుట్టింది. ఇప్పుడు జీవీ రెడ్డి కూడా తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేక రాజీనామా చేశారు. పైగా అవినీతిని, అక్రమాలను కొమ్ముకాయలేనని తేల్చేశారు. కానీ టీడీపీ హైకమాండ్ మాత్రం అవినీతి అధికారులవైపే నిలిచింది. దీన్ని జీవీ రెడ్డి తట్టుకోలేకపోయారు. చివరకు జీవీరెడ్డి రాజీనామా తర్వాత దినేశ్ కుమార్ ను బదిలీ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీ ఓ సమర్థుడైన నేతను కోల్పోయింది. పైగా అవినీతి అధికారులకు టీడీపీ వత్తాసు పలుకుతోందనే పేరు బలంగా ప్రజల్లోకి వెళ్లింది. కరుడుగట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ విషయంలో హైకమాండ్ దే తప్పు అని జీవీ రెడ్డే కరెక్ట్ అని చెప్తున్నారు.













