విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయ్ : గవర్నర్ తమిళిసై
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం అని తెలుగులో చెప్పి, ప్రసంగాన్ని ప్రారంభించడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో వినూత్న పథకాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను తట్టుకొని రాష్ట్రం నిలబడిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో అపోహలను సృష్టించారని, కానీ నేడు అభివృద్ధిలో రాష్ట్రం ఎన్నో మైలు రాళ్లను అధిగమించిందని అన్నారు. గతంలో విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయని, తెలంగాణ ప్రగతి చూసి దేశమే ఆశ్చర్యపోయిందన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించామని, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా అభివృద్ధి చెందామని, కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉందన్నారు. అయినా అదుపు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎంతో కష్టపడ్డారని, వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 28 వేలకు పెరిగిందని, ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణను పాటిస్తున్నామని వివరించారు.
తాగునీటి గోసను తీర్చిన మిషన్ భగీరథ
మిషన్ భగీరథ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. చాలా సంవత్సరాల పాటు ఉన్న తాగునీటి గోసను ఈ పథకం తీర్చిందన్నారు. ప్రతి మారుమూల పల్లె, తండా, గూడెం వరకూ భగీరథ జలాలను అందిస్తున్నామని, తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇక… మిషన్ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించామని, ఈ పథకం ద్వారా సుమారు 30 వేల చెరువులను బాగు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగాయని, కొత్త రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని పునరుద్ఘాటించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని, కరువు ప్రాంతాలకు సాగునీరు అందివ్వడంతో పాలమూరు వలసలకు అడ్డుకట్ట పడిందన్నారు.
24 గంటల విద్యుతిస్తున్నాం
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందని, జాతీయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ అని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు 10 వేల చొప్పున ఇస్తున్నామని, రుణాల కింద వ్యవసాయ పరికరాలను అందించి, రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 2.10 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయని, 2020-21 ఏడాదిలో 1.04 కోట్ల ఎకరాల్లో వరి ధాన్యాన్ని సాగు చేశామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆసరా పెన్షన్లను అందించి, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అండగా ఉందన్న భరోసాను ఇస్తున్నామన్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని, తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గవర్నర్ తమిళిసై తెలిపారు.













