ఉమ్మడి సమస్యల పరిష్కారానికి కృషి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హామీనిచ్చారు. ‘కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలతో మాట్లాడతా’నని ఆయన అన్నారు. విజయవాడలోని గుణదలలో నిర్మించిన ‘విద్యుత్ సౌధ’, ఆంధ్రప్రదేశ్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్‌ఎల్‌డీసీ)ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కిమిడి కళావెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి గవర్నర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ‘విద్యుత్ సౌధ’, ఎస్ఎల్డీసీ భవనాల్లో కల్పించిన వసతులను చూసి ఆనందపడ్డారు. సంతోషానికి చిహ్నంగా ఈ భవనాలకు ‘సమృద్ధి’ అనే పేరు పెట్టాలని సూచించారు. తాను గవర్నర్‌గా ఉన్నా, లేకపోయినా అందమైన భవనాల ప్రారంభోత్సవ ఫలకాలపై తన పేరు ఉండాలని ఆకాంక్షించారు. తన పేరు ఉందా లేదా అనే విషయాన్ని చెన్నై నుంచి అయినా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు.
ఎస్ఎల్డీసీ నుంచి రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ సరఫరా, పంపిణీ తీరును పర్యవేక్షించే సౌకర్యం ఉంది. దీన్ని అధికారులు గవర్నర్‌కు చూపించారు. ఈ సందర్భంగా గవర్నర్ అడిగిన ఒక సందేహానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇంజినీరు మాదిరి ముఖ్యమంత్రి సమాచారాన్ని తెలిపారని, విద్యుత్ రంగంపై ఆయనకు పూర్తి పట్టు ఉన్నదని గవర్నర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రిని అభినందిస్తున్నానని, రెండో దశ సంస్కరణల్లోనూ విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. ‘చంద్రబాబు ఏదైనా ఒకటి పట్టుకున్నారంటే వదలరు. దాన్ని స్వప్నిస్తూ నిరంతరం కష్టపడి సాధిస్తారు. యంత్రాంగాన్నీ పరుగులు పెట్టిస్తారు’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఫైబర్‌గ్రిడ్‌ను ప్రస్తావిస్తూ.. రూ.200కే ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు. వైఫై వంటి సౌకర్యాలు వస్తాయి. అయినా ఇంట్లో కూర్చోకండి. పనిచేయండి. ఇంటి నుంచి పని చేస్తామని అనవద్దని ఉద్యోగులకు సూచించారు. విద్యుత్ నిల్వ (పవర్‌బ్యాంక్) ఇప్పటి ఆవశ్యకత అని, ఎలక్ట్రిక్ వాహనాల అవసరం ఉందని అన్నారు.













