Nara Lokesh: విశాఖ గూగుల్ ఏఐ హబ్ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రి లోకేష్

ప్రపంచ వేదికపై విశాఖ గూగుల్ ఏఐ హబ్ కీలకపాత్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అత్యుత్తమ ప్రాజెక్ట్
కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్నాం
కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఏపీలో పాఠ్యాంశాలు
న్యూఢిల్లీ: విశాఖ ఏఐ హబ్ కేవలం ఆంధ్రప్రదేశ్, గూగుల్ కే కాదు… యావత్ భారతదేశానికి చరిత్రాత్మకమైంది. గూగుల్ డేటా సెంటర్ గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, విస్తృతమైన సేవలను అందించబోతోంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముందుండి నడిపించడం గర్వకారణంగా భావిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూడిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో విశాఖ ఏఐ హబ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గూగుల్ ప్రతినిధి బృందం నడుమ కీలక అవగాహన ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో ఏర్పాటుకానున్న ఏఐ హబ్ కేవలం భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించడం మాత్రమే కాదు… ప్రపంచ వేదికపై భారత్ కీలకపాత్ర పోషించేలా చేస్తుంది, అందుకే యావత్ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాజెక్టు కోసం సమష్టిగా కలసి పనిచేసిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎంతటి అద్భుతాలు సాధించవచ్చో ఈ ప్రాజెక్టు ద్వారా స్పష్టమవుతోంది. డేటా ఇంధనం అయితే, డేటా సెంటర్లు రిఫైనరీల లాంటివి. 12 నెలల్లో పూర్తవుతుందనకున్న ఏఐ హబ్ ఎంఓయూ ఒక నెల ఆలస్యమైంది. ఇది ఒక ఉత్సాహభరితమైన ప్రయాణం. ఈ మజిలీలో ఎందరో కనిపించని హీరోలు ఉన్నారు. గూగుల్ ఉన్నతాధికారులు వికాస్ కోలే, అలెక్స్, ఆశిష్ తదితరులంతా ఇందుకోసం ఎంతో కృషిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల విజనరీ లీడర్ షిప్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్గదర్శకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది. సమాచార,ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ ఈ ప్రాజెక్ట్ రప్పించడానికి అద్భుతమైన సహకారం అందించారు. అందరి సమష్టికృషితో భారతదేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్ ఆవిష్కృతమైంది.
అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన యువత నైపుణ్యం పెంచుకోవాలి, కృత్రిమ మేధస్సును (ఏఐ)ని స్వీకరించాలి, పాఠ్యాంశాలను పునర్వ్యవస్థీకరించాలి. మన యువతను కొత్త అవకాశాలకు సిద్ధం చేయాలి. గతంలో ఐటీ విప్లవం వల్ల భారత్ లాభపడింది. Y2K విప్లవం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల రూపురేఖలు మార్చింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI)తో కొత్తతరం నగరాలు అభివృద్ధి చెందబోతున్నాయి. అందుకే విద్యకు అంతటి ప్రాధాన్యమైన పాత్ర ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయన్ని గ్రహించారు. అందుకే విద్య, ఐటీని ఒకే మంత్రిత్వ శాఖ కిందకు తెచ్చి, ఆ బాధ్యతలను నాకు అప్పగించారు. ఈ రెండు రంగాల్లో క్షేత్రస్థాయి అత్యుత్తమ ఫలితాలను తేవడమే నా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైన శాఖ రియల్ టైం గవర్నెన్స్ (RTG). దీనిద్వారా కృత్రిమ మేధస్సు ఆధారిత పద్ధతులను అమలుచేయడం ద్వారా రైతులు, కూలీలు వంటి వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వినియోగిస్తున్నాం. తద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాల వారి ఆదాయం పెంచడమే లక్ష్యం.
ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన నినాదానికి కార్యరూపం ఇవ్వడమే మా ధ్యేయం. విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని కచ్చితంగా అమలు చేస్తుంది. అటువంటి నిర్ణయం భారతదేశం, ప్రపంచానికి కూడా నమూనాగా మారుతుంది. మా లక్ష్యాలను అధిగమించేందుకు గూగుల్ మార్గదర్శకత్వం వహించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ ఏఐ హబ్ మన యువతను తర్వాత తరం సాంకేతిక విప్లవానికి సిద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో అధునాతన సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుగారి నాయకత్వంలో మేం ఎల్లప్పుడూ ముందుంటాం, ఇప్పుడు మేం అదే చేస్తున్నాం. ఈ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు 13 నెలల్లో మేము సాధించింది, వచ్చేసారి 12 నెలల్లోనే సాధిస్తాం. ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.