Google Data Center: రూ.50వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో.. గూగుల్ డేటా సెంటర్
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెడుతోంది. ఆ సంస్థ సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ (Google Data Center) ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియా (Asia)లోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ (Visakhapatnam) వేదిక కానుంది. గూగుల్ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా తెలిపింది. గూగుల్ ప్రతిపాదన గేమ్ ఛేంజర్ కానుంది. ప్రపంచానికి డిజిటల్ హబ్‌గా దేశానికి గుర్తింపు వస్తుంది అని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక, సమన్వయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్ (YouTube) , ఏఐ వర్క్‌ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటైతే మన దేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది. దీనివల్ల డేటా చౌర్యం అనే భయం ఉండదు. డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్దఎత్తున నీరు అవసరం. అందుకే డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది. గూగుల్ సంస్థ పెట్టే సుమారు 50 కోట్ల పెట్టుబడుల ఆధారంగా సుమారు 25 వేలమందికి దశలవారీగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.







