ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ ఉద్యోగులకు శుభవార్త
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ 192వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఉద్యోగుల వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ఆ సంస్థ ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వెల్లడించారు. కార్పొరేషన్ ఉద్యోగుల వయో పరిమితి నిబంధనలను సడలించినట్టు చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా గతేడాది ఆ సంస్థ లాభాలను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని బోనస్‌గా ఇస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరులోని ఎడ్లపాడు స్పైసెస్ పార్కులో 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చిల్లీ, టెర్మరిక్ కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.రమణ (ఐఏఎస్), డైరెక్టర్లు బి.ఎల్.ఎన్.మణిశంకర్ నాయుడు, మెట్ల వెంకట రమణ, గంగోడు నాగేశ్వరరావు, డి.రాజవర్దన్‌రెడ్డి, పవన్‌కాంత్, ఎన్.కె.గ్రోవర్, పి.కె.దాస్ పాల్గొన్నారు.













