టీడీపీలోకి ఆదిశేషగిరిరావు ?
ప్రముఖ సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు లేఖ రాశారు. చాలా ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆయన భావించగా, విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని జగన్ సూచించారు. దీనిపై మనస్తాపంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా బంధువైన ఆదిశేషగిరిరావు ఇటీవల ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ద్వారా టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించిన టీడీపీలో చేరడంపై చర్చించనున్నట్టు తెలిసింది.













