త్వరలో నెల్లూరుకు విమాన సేవలు

నెల్లూరు జిల్లాకు త్వరలో విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన అభివృద్ధి మంత్రి అశోక్ గజపతి రాజు వెల్లడించారు. మంత్రి నారాయణ కుటుంబాన్ని నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో అశోక్ గజపతిరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు భూ సేకరణ జాప్యం జరుగుతోందన్నారు. పూర్తిస్థాయి స్థలసేకరణ చేపట్టి, రహదారులు నిర్మించి విమాన సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రపంచ దేశాలతో పోటీగా భారత విమానయాన సేవలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. అలాగే ఆర్థికంగా మరింత వనరులు చేకూర్చేలా సరుకుల రవాణపై కూడా దృష్టి పెడతామని పేర్కొన్నారు.