AP రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ
AP రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా అనిల్‌కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాంబశివరావును రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ శాఖలను ఆయనకు అప్పగించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాశకు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన బాధ్యతలు స్వీకరించేవరకు ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా ఉన్న అర్జా శ్రీకాంత ఈ బాధ్యతలు చూస్తారు. ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా ఎ.బాబును నియమించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ సీఈవోగా, ఏపీఐఐసీ ఎండీగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా జె.నివాస్ నియమితులయ్యారు.
పంజాబ్ నుంచి తిరుమలకు..
సింఘాల్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసి, మంచిపేరు తెచ్చుకున్నారు.ముక్కు సూటిగా వ్యవహరించే అధికారిగా, నిజాయతీపరుడిగా ఆయనకు పేరుంది. కొంతకాలం ఆయన కేంద్ర సర్వీసుల్లోనూ పనిచేశారు. చాలా కాలం నుంచి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. టీటీడీ ఈవోగా వెళ్లాలని సింఘాల్‌కు సీఎం సూచించారు. వివిధ శాఖల అధికారిగా విధులు నిర్వహించిన సింఘాల్ కూడా ధార్మిక సంస్థలో పనిచేయడానికి ఆసక్తి చూపినట్లు తెలిసింది.
ఏడుకొండలవాడే పిలిపించుకున్నాడు
టీటీడీ ఈవోగా తనను నియమించడం పట్ల సింఘాల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఏటా రెండు సార్లు స్వామివారిని దర్శించుకుంటాను. కాలినడకనే కొండకు వెళతాను. తన సేవ కోసం ఏడుకొండలవాడే నన్ను పిలిపించుకున్నట్లు అనిపిస్తుంది. నన్ను ఈవోగా నియమించిన సీఎంకు కృతజ్ఞతలు’ అని సింఘాల్ తెలిపారు.













