పోలవరం ఫైళ్లు దగ్ధం.. అందుకే మదనపల్లి అగ్నిప్రమాదం జరిగిందా?
రీసెంట్గా అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపింది. కార్యాలయంలోని ఫైళ్లు దహనం ఘటనపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యింది. ఇక కేసుకు సంబంధించి పలువురు అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం ప్రాజెక్టుకు ఈ ఘటనకు మధ్య లింకు ఉన్నట్లు బయటపడింది. మరో పక్క దీని వెనుక జగన్ నిర్వాకం ఉంది అన్న చర్చ బలంగా వినిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఫైళ్లు కూడా ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి అన్న విషయం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైళ్ల వ్యవహారం పై విచారణ సాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. పోలవరంకు సంబంధించిన ఎడమ ప్రధాన కాలువ ఫైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న హస్తం ఎవరిది అన్న విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ లబ్ధిదారుల పరిహారం విషయంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అవి బయటపడకుండా ఉండడం కోసమే అగ్ని ప్రమాదం నాటకం సృష్టించారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ ఘటనను పూర్తిగా పర్యవేక్షించి నిజా నిజాలు బయట పెట్టడం కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఇప్పటికే విచారణ చేపట్టారని అంటున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో పనిచేసిన వేదవల్లి.. ఈ దుర్ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నారట. ప్రస్తుతం అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ జరుగుతుంది. అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఎన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి.. దగ్ధమైన ఫైళ్లలో ఉన్న సమాచారం ఏమిటి.. అన్న విషయాలపై విచారణ జరుగుతుంది. ముందు ముందు ఈ విచారణలో మరిన్ని వివరాలు బయటపడతాయో చూడాలి.













