రాష్ట్ర ప్రభుత్వ దుందుడుకు పనులకు కేంద్రం బ్రేక్
తాను అనేక వ్యవసాయరంగ ఉద్యమాల్లో పాల్గొన్నానని, ఎక్కడా ఇన్ని రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపిన దాఖలాలు లేవని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. నూటికి నూరుపాళ్లు రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పారు. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళల నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సీఎం వచ్చాక మంచి కార్యక్రమాలను కొనసాగించాలని, అంతేకానీ ఎదుటి పార్టీకి మంచి పేరొస్తుందని అన్నీ ఆపేయడం దారుణమన్నారు. రాజధానిపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని అన్నారు. అందరి ఆమోదంతోనే అమరావతిని ఎంపిక చేశారన్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఎన్నో రకాలుగా ఆలోచించి అందరితోనూ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఎవరీ అంగీకారం లేకుండా హైకోర్టును ఎలా మారుస్తారని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి రూ.1632 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం యూసీలిచ్చిందని అన్నారు. ఇంత జరిగాక విశాఖకు రాజధానిని తరలించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘాల తరపున రాజధాని రైతులకు మద్దతుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ దుందుడుకు పనులకు కేంద్రం బ్రేక్ వేయడం ఖాయమన్నారు. ఈ అంశంలో రైతులతో పాటు తాను కూడా న్యాయపోరాటం చేస్తానని ఆయన సృష్టం చేశారు.













