AP Government Employees: బకాయిలు, డిఏలు వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు మళ్లీ ముందుకు వచ్చాయి. ప్రభుత్వం నుంచి వాయిదా పడుతున్న బకాయిల చెల్లింపులు, డిఏలు విడుదల కాకపోవడం, హామీలు అమలు కాకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇక ఆలస్యం చేస్తే ఆందోళనలు తప్పవని స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఇంకా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్మ్ రీలీఫ్ (IR) ప్రకటన, 12వ పేచే రివిజన్ కమిషన్ (PRC) నియామకం, మూడు పెండింగ్ డిఏలు విడుదల వంటి అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని చెప్పారు. బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం వలన ప్రతి ఉద్యోగి, పెన్షనర్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేఏసీ అమరావతి (JAC Amaravati) నాయకులు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. బొప్పరాజు వెంకటేశ్వర రావు (Bopparaju Venkateswara Rao) మాట్లాడుతూ ఉద్యోగ సమస్యలను పట్టించుకోకపోతే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని చెప్పారు.
ఇటీవల ఈ నెల 20న ముఖ్య కార్యదర్శి (Chief Secretary – CS) వద్ద జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను వివరించినప్పటికీ, మరుసటి రోజు 21న కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చే జరగకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నిర్లక్ష్యం వలన ఉద్యోగులు, పెన్షనర్లలో ఆqవేదన మరింత పెరిగింది.
రిటైర్డ్ అయిన ప్రతి పెన్షనర్ కు 15 లక్షల నుండి 25 లక్షల వరకు బకాయిలు ప్రభుత్వానికి రావాల్సి ఉన్నాయంటూ సంఘాలు చెబుతున్నాయి. అదేవిధంగా మూడు డిఏలు ప్రకటించకపోవడం, సొంత అవసరాల కోసం తీసుకున్న సరండర్ లీవ్ మొత్తాలు కూడా ఇంకా చెల్లించకపోవడం వలన ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని వివరించారు.
ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి చర్చించాలని సూచించారు. అలాగే గ్రామ-వార్డు సచివాలయ (Village & Ward Secretariat) సిబ్బందికి సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని, నోషనల్ ఇంక్రీమెంట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (Panchayat Secretary Grade-6) పోస్టులకు మాత్రమే ప్రత్యక్ష నియామకాలు జరగాలని కోరారు.
ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు తప్పవు. అందువల్ల ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.