ఘనంగా డాక్టర్ రామినేని అవార్డుల ప్రదానోత్సవం
మానవ జీవన విధానాన్ని తెలియజెప్పేదే మన సనాతన, వారసత్వ హిందూ ధర్మమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో ఆదివారం రామినేని ఫౌండేషన్ 19వ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నాది అనేదాన్ని ఇతరులతో పంచుకోమని చెప్పేదే హిందూ ధర్మమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను మనం మర్చిపోకూడదని, మన పంటలు, వంటలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఐక్యత చాలా అవసరమన్నారు. మాతృభాషను గౌరవించాలని, విదేశీయులు వారి మాతృభాషల్లోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇస్తారని గుర్తుచేశారు. మన దేశంలో విద్యావిధానం భారతీయ భాషల్లో జరగాలని, ఆ తర్వాతే ఇంగ్లీషు బోధన ఉండాలని సూచించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో మాత దేశాన్ని మనం మర్చిపోకూడదని, వన్ నేషన్ వన్ పీపుల్‌గా బతకాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో విమర్శలు బాగా పెరిగాయన్నారు. అవి ప్రజలను బాధించే స్థాయికి పెరగడం మంచిది కాదని, నాయకుడెప్పుడూ మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలే తప్ప, బాధించేవాడుగా ఉండకూడదని హితవు పలికారు. మంచిమాట దానం లాంటిదైతే చెడ్డమాట అప్పులాంటిదని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
అందరూ మంచి పద్ధతుల్లో జీవనం కొనసాగించాలని, ఎవరినైనా కులం, వర్గం పేరుతో నిందిస్తే వారు భారతీయులు కారని స్పష్టం చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్నప్పటికీ గత 19 సంవత్సరాలుగా రామినేని ఫౌండేషన్ భారత్‌లోని ప్రతిభావంతులకు పురస్కారాలు అందించి వారి బాధ్యతలను గుర్తుచేస్తూ ఆదర్శవంతంగా నిలుస్తోందన్నారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రామినేని విశిష్ట పురస్కారం అందజేయగా, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, సినీ దర్శకుడు నాగ్ అశ్విన్, బాల సాహితీవేత్త చొక్కాపు వెంకటరమణలకు రామినేని విశేష పురస్కారాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందజేశారు. విశిష్ట పురస్కారం కింద రూ. 2లక్షలు, విశేష పురస్కారాల కింద లక్ష చొప్పు న నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, గుంటూరు జెడ్పీ మాజీ చైర్మన్ నాగభూషణం, ధర్మప్రచారక్, తదితరులు పాల్గొన్నారు.













