ధర్మవరం టికెట్ శ్రీరామ్ కు దక్కేనా..?
అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం లో తెలుగు తమ్ముళ్లు హై టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మరెవరో కాదు పరిటాల శ్రీరామ్. ఇతనికి అక్కడ అనుచరుల బలం, అండతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వరదాపురం సూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.పార్టీని ముందుకు నడిపే నాయకుడు లేని ఆ సమయంలో శ్రీరామ్ ధర్మవరంలో ఎంట్రీ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జిగా.. ఎన్నో కార్యక్రమాలను దగ్గరుండి నడిపించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ పైనే శ్రీరామ్ అంత రిస్క్ తీసుకున్నాడు అని టాక్. ఇప్పుడు మొత్తానికి కూటమి కన్ఫర్మ్ అయ్యాక ఈ స్థానాన్ని టీడీపీ.. బీజేపీ కి వదులుకుంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. సీట్ల సర్దుబాటులో 10 సీట్లు తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఇంకా ఒక్క సీటుపై కూడా అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. దీంతో టీడీపీ శ్రేణులలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో బిజెపికి ఇచ్చేది లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఎందుకంటే బీజేపీ తరఫున సీటు వరదాపురం శీనుకి వెళ్తుంది.. పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు వదిలిన ద్రోహికి నియోజకవర్గం అప్ప చెప్పేది లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.













