దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
మహిళా భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును హోం మంత్రి సుచరిత సభలో ప్రవేశపెట్టారు. లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన తర్వాత 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా దిశ బిల్లును రూపొందించారు. దీంతోపాటు ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా బిల్లులో పొందుపరిచారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే 354 (ఈ) సెక్షన్‌ను ఈ బిల్లులో పొందుపరిచారు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిపట్ల అఘాయిత్యాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈ చట్టంలోని 354 (ఎఫ్)తో పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. గవర్నర్ ఆమోదం తర్వాత దిశ బిల్లు చట్టంగా మారనుంది.













