ఈసారి కేంద్రంలో కొత్త ప్రధాని : దేవినేని
ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటే కేవలం బీజేపీ, వైకాపా కుట్రేనని మంత్రి దేవినేని ఊమామహేశ్వరావు ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంల మరమ్మతుల కోసం 6 గంటల సమయం తీసుకున్నారని, ఒక ఈవీఎం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయడానికి అంత సమయం అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని జగన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. బిహార్ ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయిరెడ్డి పాపాలు బయటకు రావాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం దేశానికి కొత్త ప్రధాని రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ గెలవాలని కేవీపీ కుట్రలు పన్నారని ఆరోపించారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ అంటున్నారని, అయితే పోలవరానికి సంబంధించిన సమాచారమంతా ఆన్లైన్లో ఉందన్నారు. కేవీపీపై అమెరికాలో చాలా కేసులు ఉన్నాయని ఆరోపించారు.













