ఆంధ్రా రుచులకు దావోస్ ఫిదా!
ఆంధ్ర వంటకాలు దావోస్ లోనూ నోరూరించాయి. తెలుగు రుచులకు ప్రపంచ గుర్తింపు తెచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సును వేదికగా చేసుకుంది. దావోస్ లోని రాష్ట్ర ప్రభుత్వ పెలివియన్ లో పర్యాటక శాఖ ఆంధ్ర వంటకాలకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర పంచాయ్తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులను కూడా ఆంధ్రా వంటకాలు ఆకట్టుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు తెలుగు రుచులను ఆస్వాదించడంతో పాటు తయారీ విధానంపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. కొందరు ఔత్సాహికులు ఆయా వంటకాల తయారీలో వినియోగించే దినుసులు, ఇతర పదార్థాల వివరాలు తెలుసుకోవడం విశేషం. కొంత కాలంగా పర్యాటక శాఖ తెలుగు రుచులను పర్యాటకులకు పరిచయం చేసేందుకు ప్రత్యేక కార్యా చరణ చేపట్టింది.
ఇందులో భాగంగా విశాఖపట్నం మ్యారియట్ సహకారంతో దావోస్‌లో ఏర్పాటు చేసిన విందు తెలుగుదనానికి ప్రతికగా నిలిచింది. పలువురు విదేశీ ప్రతినిధులు ఏపీ వంటకాలను రుచి చూసి అద్భుతంగా ఉందని కొనియాడటంతో పాటు పర్యాటశాఖ ప్రయత్యాన్ని అభినందించారు. రుచి, పోషక విలువతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఆహారం కనుమరుగు కాకుండా కాపాడేందుకు ఈ తరహా కార్యాక్రమాలను చేపట్టినట్లు ఏపీ టీడీసీసీ ఈవో హిమాన్షు శుక్లా స్టాల్‌ను సందర్శించిన ప్రతినిధులకు వివరించారు.
రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రానున్న రోజుల్లో అంతర్జాతీయ సదస్సు వేదికల వద్ద ఆంధ్ర వంటకాలకు సంబంధించిన స్టాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దావోస్‌లో ఏర్పాటు చేసిన ఆహారానికి అనూహ్య స్పందన రావడంతో పాటు పరాయి దేశంలో తెలుగు వంటకాలు దొరకడంపై రాష్ట్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.













