ఏపీలో డేటాసైన్స్ యూనివర్సిటీ
ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సైన్స్ కంపెనీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు సృష్టం చేశారు. వెలగపూడి సచివాలయం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆ సంస్థ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన సృష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం మన దేశంలో బెంగుళూరు కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 4 వేల మంది డేటా సైంటిస్టులతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మ్యూసిగ్మా సంస్థ 500 మంది డేటా సైంటిస్టులతో ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు అనలిటిక్స్, డేటా సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
మ్యూసిగ్మా కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి లోకేష్ సృష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రియల్‌టైం గవర్నెన్స్, సిఎండ్యాష్బోర్డు, డ్రోన్ ఇమేజ్ రికగ్నేజేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం అందించాలని మ్యూ సిగ్మా కంపెనీ ప్రతినిధులను ఐటిశాఖ మంత్రి నారాలోకేష్ కోరారు. రియల్‌టైమ్ గవర్నెన్స్, డేటాసైన్స్, అనలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని మ్యూసిగ్మా కంపెనీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటిశాఖ సలహాదారుడు జె.ఎ.చౌదరి, ఐటికార్యదర్శి విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













