అమరావతి అభివృద్ధికి రూ.30 వేల కోట్లు
అమరావతిలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనుల కోసం రానున్న మూడేళ్లలో సుమారు రూ.30 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సీఆర్డీయే అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలియజేశారు. వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లో సీఆర్డీయే సమీక్ష సమావేశం జరిగింది. రాజధాని మౌలిక వసతుల కల్పనకు అవసరమైన రూ.30 వేల కోట్లలో వివిధ ఆదాయ వనరులు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు కలుపుకుని రూ.22,700 కోట్లు ఇప్పటికే సమకూరాయని సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ సీఎంకి వివరించారు. ఇందులో హడ్కో ద్వారా రూ.7,500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు రూ.3,80 కోట్లు, బహుళ సంస్థల ద్వారా రూ.3,200 కోట్లు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ రూపంలో రూ.2,500 కోట్లు, స్మార్ట్ సిటీ నిధులు రూ.100 కోట్లు, విట్, తదితర సంస్థలకు భూ కేటాయింపుల రూపేణా సమకూరిన రూ.400 కోట్లు ఉన్నాయని వివరించారు. ఇవి పోను మిగిలిన రూ.7,300 కోట్లను 7 మార్గాల్లో సమీకరించుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.













