కోవిడ్ పూర్తిగా పోతుందని అనుకోవద్దు : సీఎం జగన్ హెచ్చరిక
కోవిడ్ ఎప్పటికీ పూర్తిగా పోతుందని అనుకోకూడదని, జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని ,మాస్కులు, శానిటైజర్లతో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లను, సిబ్బందిని సీఎం జగన్ ప్రశంసించారు. కోవిడ్ నియంత్రణ విషయంలో అద్భుతంగా పనిచేశారని, కర్ఫ్యూ కూడా సత్ఫలితాలనే ఇచ్చిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతోందని, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంటుందని, ఆ తర్వాత సడలింపులతో కూడిన కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రతి గ్రామంలో టెస్టులు చేయాలని, ప్రతి వారం ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు.
ప్రభుత్వం ప్రకటించిన రేట్ల ఆధారంగానే ఛార్జీలు వసూలు చేయాలని, ఎక్కువగా ఎవరైనా చేస్తే, వారి ఆస్పత్రుల మూసివేతకు కూడా వెనకాడవద్దని ఆదేశించారు. కేసులు తగ్గాయని కలెక్టర్లు విశ్రాంతిలో ఉండకూడదని, అప్రమత్తతతోనే ఉండాలని సూచించారు. కోవిడ్ టెస్టులు ఇష్టాను సారంగా కాకుండా, ఫోకస్‌గానే చేయాలని, ఎవరైనా అడిగితే, వారికి కూడా చేయాలని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, పూర్తి సన్నద్ధతోనే ఉండాలని సీఎం కోరారు. పిల్లల వైద్యం కోసం మొత్తం మూడు ఆస్పత్రులను అందుబాటులోకి తేవాలని తాము నిర్ణయించామని సీఎం వెల్లడించారు. కృష్ణా- గుంటూరు, తిరుపతిలో తీసుకొస్తున్నామని, అవసరమైన భూమిని గుర్తించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. థర్డ్ వేవ్ వస్తుందో లేదో, తెలియదు కానీ, అప్రమత్తత మాత్రం కచ్చితంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టుకు సెలవులు ముగిశాయి.. దృష్టి నిలపండి….
‘జగనన్న శాశ్వత భూహక్కు’ కార్యక్రమం కోవిడ్ కారణంగా ముందుకు సాగలేదని, దీనిపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. అయితేనే వివాదాలకు తెర పడుతుందని, దీనిపై ప్రగతిని పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా మూడు లక్షల మందికి పైగానే ఇళ్ల స్థలాలు రాలేదని, ప్రస్తుతం హైకోర్టు సెలవులు ముగిశాయని, ఇలాంటి కేసుల మీద దృష్టి పెట్టాలని సీఎం జగన్ కోరారు. ప్రతి రోజూ రివ్యూలు చేయాలని, అలాంటి కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.













