త్వరలో ఆ పథకం ప్రారంభిస్తాం : వైఎస్ జగన్
కార్పొరేషన్, మున్సిపల్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసినట్లు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైఎస్ చైర్మన్లకు నిర్వహించిన ఓరియంటేషన్ తరగతుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. దీనికోసం ప్రతి వార్డుకు 2 చొప్పున 8వేల వాహనాలు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందాలని, వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సేవలందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా 540 రకాల సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. మరింత మెరుగైన సేవలకు సూచనలివ్వాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేశామన్నారు. పేదల కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించే యోచన చేస్తున్నామని, త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టణ, నగర ప్రాంతాల పాలక మండళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, సీఎం కార్యాలయంతో సంప్రదించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవరత్నాలతో లబ్ధిదారులకు రూ.లక్షకోట్లు అందించామన్నారు. రైతులకు విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు సౌకర్యం కల్పించామని తెలిపారు.













