హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు : చంద్రబాబు
ప్రముఖ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ ప్రమాద వార్త వినగానే చంద్రబాబు హుటహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో ఆసుపత్రికి బయల్దేరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనాస్థలానికి వెళ్లాలని, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు. హరికృష్ణ మృతి పార్టీకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని, సాంఘిక పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చేయి అని కొనియాడారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఎన్టీఆర్కు హరికృష్ణ అత్యంత ఇష్టుడు అని, ఎన్టీఆర్ చైతన్య రథసారథిని స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్ను ప్రజలకు చేరువ చేశారని గుర్తు చేశారు. నిరాడంబరుడు, నిగర్వి, స్నేహానికి మారుపేరు అయిన హరికృష్ణను కోల్పోవడం బాధాకరమన్నారు.
హరికృష్ణ మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతికి గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు లోకేశ్, కేఈ, కళా వెంకట్రావు, పరిటాల సునీత, నక్కా ఆనందబాబు, టీడీపీ నేతలు రఘురామకృష్ణంరాజు, ఏవీ రమణ, ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు హరికృష్ణ కుటుంబానికి సంతాపం తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి వెళుతుండగా అన్నెపర్తి దగ్గర డివైడర్ను ఢీకొన్న సంఘటనలో హరికృష్ణ మృతి చెందారు.













