వెంకయ్య ఏపీకి ఎంతో చేశారు : చంద్రబాబు
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైక వెంకయ్యనాయుడు తన రాజకీయ జీవితంలో సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పౌర సన్మాన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో పుట్టి మొట్టమొదటి ఉప రాష్ట్రపతి అయిన వ్యక్తి వెంకయ్య అని కొనియాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి అన్నారు. 1978లో వెంకయ్యనాయుడు, నేను ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలిచామన్నారు. మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచే ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు.
విభజన సందర్భంలో ఏపీ తరపున నిలబడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్చె తెచ్చారని అన్నారు. తెలుగులో ఏ విధంగా మాట్లాడతారో హిందీలోనూ, ఆంగ్లంలోనూ అదే స్థాయిలో అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి అని కొనియాడారు. ఎప్పుడూ సమయపాలన పాటించేవారని చెప్పారు. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలందిస్తున్నారని అన్నారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తికి అమరావతిలో సన్మానించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తెలుగు జాతి గర్విచదగ్గ వ్యక్తి వెంకయ్య అని కొనియాడారు.













