ఆపద్బాంధవుడు.. అలుపెరుగని నాయకుడు!
* సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకున్న చంద్రబాబు
* వరదపై యుద్ధం.. కలెక్టరేట్ లోనే మకాం
* పది రోజులు.. రోజుకు 18 గంటలు ప్రజల్లోనే..!
* పండగ, పెళ్లి రోజు వేడుకలూ కలెక్టరేట్లోనే..!
* ఏడు పదుల వయసులో యువకుడిలా పరుగులు
కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన నాయకుడు. అలాంటి విపత్తుల సమయంలోనే నిజమైన నాయకుడి సత్తా ఏంటో బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజమైన నాయకుడు అని మరోసారి నిరూపితమైంది. తాజా వరదలు ఆయనలోని నాయకుణ్ణి మరోసారి జనానికి పరిచయం చేశాయి. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసీ ఆయన రాత్రింబవళ్లూ పదిరోజులపాటు శ్రమించారు. వాళ్లను ఆదుకునేందుకు 74 ఏళ్ల వయసులో అలుపెరగకుండా పోరాటం చేశారు. వాళ్ల కష్టాల్లో పాలుపంచుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
చంద్రబాబు నాయుడికి విపత్తులను ఎదుర్కోవడం కొత్త కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన ఇలాంటి సంక్షోభాలను, విపత్తులను ఎదుర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు ఎలా సహాయపడాలో.. వాళ్లను ఎలా గట్టెక్కించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన పాలనా అనుభవం ఇందుకు దోహదపడుతోంది. విపత్తుల సమయంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి సులువుగా సమస్యలను పరిష్కరించగలగడం ఆయన గొప్పతనం. ఇప్పుడు విజయవాడలో బుడమేరు సృష్టించిన విలయం నుంచి ప్రజలను కాపాడేందుకు చంద్రబాబు స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకూ ఆయన జనంలోనే ఉన్నారు. జనంతోనే నిద్రించారు. వాళ్లకోసం పూర్తిగా నిమగ్నమయ్యారు. అందుకే పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా నియంత్రించగలిగారు. సకాలంలో స్పందించకుండా ఉంటే జరిగే నష్టం ఊహించుకుంటేనే భయమేస్తోంది.
బెజవాడను ముంచేసిన బుడమేరు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆగస్టు 28నుంచి 31వరకూ ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర అతలాకుతలమైంది. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. కృష్ణానదికి వరద పోటెత్తింది. అందరి దృష్టి కృష్ణానది వరదపైనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నుంచి కృష్ణా పరీవాహక ప్రజలను కాపాడడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ ఉదయానికి విజయవాడలోని సింగ్ నగర్, రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్ లాంటి ప్రాంతాల్లోకి వరద నీరు రావడం మొదలైంది. అసలు ఆ వరద ఎక్కడి నుంచి వస్తోందో అంతుచిక్కలేదు. అప్పుడు అర్థమైంది అది బుడమేరు వరద అని. ఖమ్మం జిల్లాతో పాటు జిల్లాలో కురిసిన భారీ వర్షాల ధాటికి బుడమేరు పొంగి పొర్లుతోంది. పైగా బుడమేరు గండ్లు పడడంతో ఆ నీరంతా బెజవాడలోకి వచ్చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా నీటిలో చిక్కుకుంది. సాయంత్రానికి పరిస్థితి అర్థమైంది. వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. కృష్ణా కలెక్టరేట్ నుంచి యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తం చేశారు. ఆ రాత్రంతా ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ముందుకు సాగారు. మరుసటిరోజుకు కూడా వరద తగ్గకపోగా మరింత ఎక్కువైంది. పరిస్థితి చేయిదాటుతోందని గమనించి వెంటనే కేంద్ర ప్రభుత్వ సాయం అడిగారు. అదే సమయంలో గోదావరి జిల్లాల నుంచి 150కి పైగా రెస్క్యూ బోట్లను తెప్పించారు. ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాళ్లకు డ్రోన్ల ద్వారా పాలు, మంచినీరు, ఆహారం సరఫరా చేశారు. హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బోట్ల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారిని, గర్భిణీలు, బాలింతలను నేరుగా ఆసుపత్రులకు షిఫ్ట్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా క్షేత్రస్థాయిలో వాలిపోయారు. అధికార యంత్రాంగంపైనే భారం వేయకుండా విధులు పంచుకున్నారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వాళ్లతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. యంత్రాంగం మొత్తాన్ని పరుగులు పెట్టించారు. అందుకే భారీ ప్రాణ, ఆస్తి నష్టం నుంచి బయటపడగలిగింది బెజవాడ.
ఆపద్బాంధవుడు చంద్రబాబు
'వరదలు రావడం మా దురదృష్టం.. కానీ, ఈ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం' ఇదీ ఓ వరద బాధితుడు హోంమంత్రి అనితతో చెప్పిన మాటలు. దీన్నిబట్టి వరద బాధితుల్లో చంద్రబాబుపై ఉన్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఊహించని విపత్తు నుంచి చంద్రబాబు తమను ఎలాగైనా కాపాడతారనే నమ్మకం వాళ్లలో ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు అహరహం శ్రమించారు. ఏడు పదుల వయసులోనూ యువకుడిలా పరుగులు పెట్టారు. మోకాలి లోతు నీళ్లల్లో దిగి బాధితులతో మాట్లాడారు. నడిచే పరిస్థితి లేకపోతే పొక్లెయినర్లు ఎక్కి వెళ్లారు. బాధితుల ఇళ్లకెళ్లి సహాయం చేశారు. వరద బాధితులు మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చంద్రబాబు వాళ్లను చూసుకోగలరనే నమ్మకంతో ఉన్నారు. "మీరు ఉన్నారు కదా.. భయం లేదు" అని స్వయంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారంటే చంద్రబాబుపై వాళ్లకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం లేవగానే అధికారులు, మంత్రులతో సమీక్ష, వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించడం.. మధ్యాహ్నం మళ్లీ సమీక్ష.. వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం.. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను ఆరా తీయడం.. అందుకు అనుగుణంగా యంత్రాంగానికి ఆదేశాలివ్వడం.. పనులన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో నేరుగా వెళ్లి చూడడం.. ఇదీ సింపుల్ గా పది రోజులపాటు చంద్రబాబు పనితీరు.
10 రోజులపాటు కలెక్టరేట్ లోనే బస చేశారు చంద్రబాబు. అక్కడే తన వాహనంలో నిద్రించారు. రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రపోయారు. 18 గంటలపాటు ప్రజలతోనే గడిపారు. వినాయక చవితి, తన పెళ్లి రోజులను కూడా ఆయన కలెక్టరేట్ లోనే చేసుకున్నారు. 10 రోజుల తర్వాత సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియేట్ కు వెళ్లిన చంద్రబాబు రాత్రి 10వరకూ విధుల్లో నిమగ్నమయ్యారంటే పని పట్ల ఆయనకున్న నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. మధురానగర్ లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు రైల్వే ట్రాక్ ను పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా రైలు వచ్చింది. రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై చంద్రబాబు అలా నిల్చుండిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మీ డేర్ సూపర్ అని.. అంత రిస్క్ చేయకండి సర్ అని సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలు మాత్రమే కాదు.. మరోవైపు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద రికార్డు స్థాయిలో ప్రవహిస్తోంది. మధ్యమధ్యలో బ్యారేజ్ పైకి వచ్చి చంద్రబాబు పరిస్థితిని ఆరా తీస్తూ వచ్చారు. ఇంతలో మూడు బోట్లు ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చాయి. వీటివల్ల కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయ్యాయి. వెంటనే ఈ కౌంటర్ వెయిట్ల సంగతి చూడాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల సలహాదారుడు కన్నయ్య నాయుడును ఆదేశించారు. వాళ్లిద్దరూ వెంటనే రంగంలోకి దిగి వాటిని రిపేర్ చేసే పనిలో పడ్డారు. కన్నయ్య నాయుడు దగ్గరుండి కౌంటర్ వెయిట్లను తయారు చేయించడం.. వెంటనే వాటిని బిగించడం జరిగిపోయాయి. కేవలం 5 రోజుల వ్యవధిలోనే కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయడం రికార్డ్.
బుడమేరుకు ముకుతాడు!
వరద ప్రబావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడం ఒక ఎత్తయితే.. వరదను నగరంలోకి రానీకుండా చేయడం మరో ఎత్తు. బుడమేరుకు భారీగా గండ్లు పడ్డాయని తెలిసిన వెంటనే చంద్రబాబు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, లోకేశ్ తదితరులకు ఆ బాధ్యతలను అప్పగించారు. వెంటనే ఆ గండ్లు పూడ్చాలని ఆదేశించారు. దీంతో మంత్రి బుడమేరుకు వెళ్లి గండ్లు పూడ్చివేతలో నిమగ్నమయ్యారు. మూడు రోజుల పాటు మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చివేయించారు. ఇందుకు ఆర్మీ కూడా సాయం చేసింది. విపత్తును ఆపలేం.. కానీ దాని నుంచి ఎంత త్వరగా బయటపడగలం.. అనేది మన చేతుల్లో ఉంటుంది. సరైన నాయకత్వం, పనిచేసే యంత్రాంగం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనే బుడమేరు గండ్లు పూడ్చడం మామూలు విషయం కాదు. అయినా చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించింది.
ఆదుకున్న ఆపన్నహస్తాలు
వరద కొంచెం తగ్గుముఖం పట్టగానే బాధితులకు సహాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాలిపియంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులను బెజవాడ రప్పించింది. వాళ్లకు ఫైరింజన్లు ఇచ్చి ఇంటింటికీ వెళ్లి బురదను తొలగించే పనులు చేపట్టింది. సహజంగా ఇలాంటి సమయాల్లో ఎవరి ఇంటిని వాళ్లు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంటింటికీ ఫైరింజన్ పంపించి ఇల్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకున్నారు. 40 వేలకు పైగా ఇళ్లను ఇలా శుభ్రం చేశారు. దీనిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వరద నీటి నుంచి బయటపడిన రోడ్లను వెంటనే క్లీన్ చేసి బ్లీచింగ్ చల్లారు. మరోవైపు నిత్యావసరాలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహనాలను తెప్పించారు. పౌరసరఫరాల శాఖ లారీల ద్వారా బియ్యం, చక్కెర, కందిపప్పు లాంటి వాటితో వాలిపోయింది. బారులు తీరిన లారీల నుంచి వాటిని పంపిణీ వాహనాల్లోకి ఎక్కించి ఇంటింటికీ పంపించింది.
ఇందిరా గాంధీ స్టేడియాన్ని ఫుడ్ స్టాక్ పాయింట్ గా మార్చేశారు. మూడు పూటలా బాధితులకు ఆహారం, నీళ్లు, బిస్కెట్లు అందించారు. వీటన్నింటినీ ఐఏఎస్ స్థాయి అధికారి పర్యవేక్షించారు. 32 వరద బాధిత డివిజన్లకు 32 మంది ఐఏఎస్ అధికారులను నియమించారు. 179 సచివాలయాలకు 179 మంది ఇంఛార్జ్ లకు బాధ్యతలు అప్పగించారు. ఎక్కడైనా ఎవరికైనా ఆహారం అందకపోయినా, వరద నీటిలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నా హెల్ప్ లైన్ నెంబర్లను ఆశ్రయించాలని కోరారు. అలా ఎవరైనా కాల్ చేసినా, మెసేజ్ చేసినా క్షణాల్లో వాళ్ల దగ్గర వాలిపోయారు. వాళ్లకు సాయం అందించారు. 10వ తేదీ నాటికి ప్రభుత్వం కోటి ఆహార ప్యాకెట్లు, 90 లక్షల మంచినీటి బాటిళ్లు, పాతిక లక్షల లీటర్ల పాలు బాధితులకు అందించింది. వరద సమయాల్లో అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే పారిశుద్ధ్యాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ చల్లింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ఇంటింటికీ అవసరమైన మందులను కూడా అందించింది. ప్రభుత్వానికి తోడు ఎన్నో స్వచ్చంధ సంస్థలు, దాతలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తమదైన స్థాయిలో బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించారు. ఎంతోమంది దాతలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరివిగా విరాళాలు అందిస్తున్నారు.
సాయంలో చంద్రబాబు ఉదారత
గతంలో కూడా ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ లో విపత్తులు వచ్చాయి. లక్షలాది మంది బాధితులుగా మిగిలిపోయారు. వాళ్లందరినీ ఆదుకుంటామని ప్రభుత్వాలు చెప్పేవి. అయితే చేతికందేది మాత్రం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు సాయంలో కూడా ఉదారత చాటుకున్నారు. మధ్యతరగతి వ్యక్తి ఆలోచనలకు తగ్గట్టు ఆలోచించారు. నిర్దిష్ట గడువు పెట్టి సాయమందించాలని నిర్ణయించారు. అంతేకాక.. గతానికి భిన్నంగా సాయంలో ఉదారత ప్రదర్శించారు. వరద బాధిత కుటుంబానికి రూ.10వేలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. అలాగే.. హెక్టారు పంటనష్టానికి రూ.25వేలు, దెబ్బతిన్న వాహనానికి రూ.10వేలు అందిస్తామన్నారు. ఇల్లు దెబ్బతింటే కొత్త ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతేకాక.. ఈనెల 17లోపే వీటన్నింటినీ అందించాలని గడువు నిర్దేశించారు. ఇప్పటికీ వరద బాధితుల పరిస్థితిని రోజూ ఆరా తీస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఎవరికైనా సాయం అవసరమైతే చేస్తోంది. ఆహారం, పాలు, మందులు లాంటివి అందిస్తోంది. వరదలకు దెబ్బతిన్న ఎలక్టాన్రిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాల్ని మరమ్మతు చేయించేందుకు అర్బన్ యాప్ సాయంతో చర్యలు చేపట్టింది. నీటమునిగిన వాహనాలకు బీమా క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేయాలని సదరు కంపెనీల్ని పిలిపించి ఒప్పించింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొచ్చి కలెక్టరేట్ లో కియోస్క్ ఏర్పాటు చేసాయి.
కేంద్రం ఆపన్నహస్తం!
ఆంధ్రప్రదేశ్ విపత్తుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. చంద్రబాబు అడగ్గానే ఆపన్నహస్తం అందించింది. ఆర్మీ, నేవీ బృందాలను పంపించింది. హెలికాప్టర్లు, విమానాలను రంగంలోకి దించింది. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం వెంటనే ఏపీకి చేరుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ నష్టాన్ని లెక్కగడుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.6880 కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆదుకోవాలని కోరింది. మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రబావిత ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను శెభాష్ అని మెచ్చుకున్నారు. కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పవన్ భారీ విరాళం
ఓ వైపు వర్షాలు, వరదలు.. మరోవైపు వైరల్ జ్వరం.. అయినా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యత మర్చిపోలేదు. తీవ్ర జ్వరంలో కూడా అధికారులతో నిత్యం సమీక్షలు జరుపుతూ ప్రభుత్వ యంత్రాంగానికి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. బెజవాడ వరద విలయంలో చిక్కుకుందని తెలుసు. కానీ జ్వరం వల్ల బయటకు రాలేని పరిస్థితి. ఒకవేళ వచ్చినా తనకోసం జనం ఎగబడి ఇబ్బంది పడతారని తెలుసు. అధికారులు కూడా ఈ సమయంలో క్షేత్రస్థాయిలో వెళ్లకపోవడమే మంచిదని సూచించడంతో మూడు రోజులపాటు పార్టీ ఆఫీసులోని ఇంటికే పరిమితమయ్యారు. పవన్ కనిపించట్లేదంటూ వైసీపీ చేసిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు. “వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నా.. అయితే నా వల్ల సహాయ కార్యక్రమాలకు కలగకూడదని ఆగా.. నా పర్యటన సహాయ పడేలా ఉండాలేకానీ అదనపు భారం కాకూడదు.” అని పవన్ క్లారిటీ ఇచ్చారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుట్టిన రోజు వేడుకలకు కూడా పవన్ కల్యాణ్ దూరంగా ఉండిపోయారు. అభిమానులు, పార్టీ శ్రేణులు కూడా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అంతేకాక వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రభుత్వానికి రూ.కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్ అందజేశారు. అంతేకాక.. వరద ప్రభావిత 4వందల గ్రామ పంచాయతీలకు రూ.4 కోట్లు ఇస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కే కాకుండా తెలంగాణకు కూడా పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళమిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు. బెజవాడ వరదల అనంతరం గోదావరికి వరద పోటెత్తింది. మరోవైపు కొల్లేరు ప్రబావిత ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కూడా నీట మునగడంతో అక్కడే మకాం వేసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు పవన్ కల్యాణ్.
శెభాష్ లోకేశ్..!
ఓ వైపు తండ్రి .. మరోవైపు తనయుడు అన్నట్టు సాగింది వరద సహాయక చర్యల తీరు. తండ్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పనులు చక్కబెడుతుంటే.. లోకేశ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా పనులు పర్యవేక్షించారు. తోటి మంత్రులు, అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడంలో లోకేస్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఎంపీ పురందేశ్వరితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని వివరించారు. అనంతరం బుడమేరు గండ్లు పూడ్చివేతలో మంత్రి నిమ్మల రామానాయుడితో నిత్యం టచ్ లో ఉంటూ వాటిని సెట్ రైట్ చేశారు. అనంతరం కాలి నడకన బుడమేరు గండ్ల ప్రాంతానికి వెళ్లారు. డ్రోన్ల ద్వారా లైవ్ లో పరిస్థితిలను అంచనా వేయడం, సహాయం చేయడంలో లోకేశ్ టీం సక్సెస్ అయింది. మరోవైపు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నప్పుడు ఎస్కార్ట్ వాహనాల వల్ల ఇబ్బంది ఎదురవుతోందని.. వాటిని పక్కన పెడితే బాగుంటుందని లోకేశ్ సూచించిన వెంటనే సహచర మంత్రులంతా దాన్ని స్వాగతించారు. బెజవాడలోనే కాకుండా సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా లోకేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు సాయం అందించారు. పది రోజుల పాటు లోకేశ్ కూడా పూర్తిగా ఫ్యామిలీకి దూరంగా గడిపారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.
ఆపరేషన్ బెజవాడ సక్సెస్
బస్సే ఇల్లు, కలెక్టరేటే సచివాలయం అన్నట్లు 10 రోజుల అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. పండగలు, పెళ్లిరోజులను వదిలేసి సమీక్షలు, సడన్ విజిట్లతో అన్నీ తానై విజయవాడ వరద బాధితుల్ని ముంపు నుంచి గట్టెక్కించారు. దాదాపు 10రోజుల తర్వాత ఆయన కలెక్టరేట్ వదిలి ఇంటికి వెళ్లారు. “ఎవ్వరూ అదైర్యపడొద్దు.. అంతా సెట్ రైట్ చేశాకే ఇక్కడి నుంచి వెళ్తా..” అని మొదటి రోజు ఇచ్చన మాటకు కట్టుబడి పనిచేశారు. మాట నిలబెట్టుకున్నారు. ఈ సంక్షోభంలో తన వెన్నంటి నిలిచిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు చేతిలెత్తి నమస్కరించారు. సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.













