స్ఫూర్తిప్రదాత వెంకయ్యనాయుడు
ఉప రాష్టప్రతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడిన సందర్భంగా సచివాలయంలో వెంకయ్యనాయుడికి రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి.. భావితరాలకు శాశ్వత స్ఫూర్తిప్రదాత ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడని కొనియాడారు. వెంకయ్యనాయుడు నమ్మిన సిద్ధాంతానికి, సమయపాలనకు మారుపేరుగా నిలుస్తారన్నారు. నెల్లూరు జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తన అసమాన ప్రతిభా పాటవాలతో ఉన్నతస్థాయికి చేరుకున్నారన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపిగా, మంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నో ఉన్నతమైన పదవులను అలంకరించి, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారన్నారు. స్వచ్ఛ భారత్ రూపకల్పనతోపాటు స్మార్ట్ సిటీలకు అంకురార్పణ చేసి, మన అమరావతి రాజధానికి స్మార్ట్ సిటీ హోదాను కల్పించారన్నారు. భూవిజ్ఞాన, శాస్త్ర సాంకేతిక శాఖల సహాయ మంత్రి వైఎస్ చౌదరి మాట్లాడుతూ నిబద్దతతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఉప రాష్టప్రతి అని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ ఉప రాష్టప్రతిగా ఎం.వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టడం తెలుగువారి అందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.













