CM Chandrababu: మంత్రులు, ఎంపీలపై సీఎం చంద్రబాబు సీరియస్
వివిధ శాఖల్లో అలసత్వం ప్రదర్శించిన పలువురు మంత్రులు, ఎంపీలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు. నాకు కావాల్సింది ఫలితాలు’ అని వారితో నిర్మొహమాటంగా చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో అందరూ విఫలమయ్యారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, పార్టీ సమావేశానికి కొందరు ఎంపీలు రాకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన (CM Chandrababu).. ఇదేంటని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును క్వశ్చన్ చేశారు. పార్టీ సమావేశం కంటే మిగతా పనులు అంత ముఖ్యమా? అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు… ఆయా జిల్లా ఇన్చార్జి మంత్రుల సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను ఇన్చార్జి మంత్రులకు చెప్పి పరిష్కరించుకోవాలని, ఎమ్మెల్యే తప్పు చేస్తే ఇన్చార్జి మంత్రిదే బాధ్యత అని తేల్చిచెప్పారు.
ఇన్చార్జి మంత్రులు, ఎంపీలకు జిల్లాల వారీగా పనితీరు ఆధారంగా ర్యాంకులు కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలవడం గమనార్హం. చివరి మూడు స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగంలో మంత్రి ఫరూక్ చివరి స్థానంలో నిలవడంపై చంద్రబాబు (CM Chandrababu) అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.













