అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం
భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20 గంటల కౌంట్ డౌన్ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2:43 నిమిషాలకు నింగికేగసిన జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం1 వాహకనౌక (రాకెట్) 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం భూమికి దగ్గరగా 170 కి.మీలు.. భూమికి దూరం 39059 కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్ 2 ను విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్ 2 ప్రవేశిస్తుంది. సగటున 3.84 లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 7న జాబిల్లిపై దిగనుంది.
ఇస్రోకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇస్రోకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రయోగం ముగిసిన వెంటనే ట్విట్టర్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు వారు అభినందనలు తెలియజేశారు.













