ప్రధాని మోదీ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం
ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి అక్కడ మోదీ కి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ ద్రోహాన్ని, కుయుక్తులను వారణాసి వేదికగా చంద్రబాబు ఎండగడతారని అన్నారు. సిఇసి సునీల్ ఆరోరా వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక రక్త పరీక్షతో రోగి గురించి వైద్యులు ఓ నిర్ధారణకు కచ్చితంగా రాలేరని చెప్పారు. ఎన్నికల ఫలితాల వెలువడనున్న మే 23వ తేదీన టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయని విమర్శించారు. 23న వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ రానంతగా ఇసిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని దీనికా కారణం ఇది మోదీ నియమించిన ఇసీ కావడమేనని చెప్పారు. ఇసీ మద్దతుతోనే వైసీపీ అరాచకాలకు తెగబడిందని దుయ్యబట్టారు. అరాచకాలకు పాల్పడిన వైసీపీ కే మోదీ నియమించిన గరవ్నర్ కూడా అపాయింట్మెంట్ ఇస్తారని విమర్శించారు.













