రాజకీయాలు కాదు.. బాధితులను ఆదుకోవాలి
వరద ముంపు బాధితులను ఆదుకునే చర్యల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పార్టీ శ్రేణులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని చంద్రబాబు వారించారు. వరద బాధితులను వీలైనంత మేరకు ఆదుకోవాలని సూచించారు. లంక గ్రామాల ప్రజలు, రైతులను ఆదుకోవాలని కోరారు. సహాయక చర్యల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జులు, ఇతర నేతలు పాల్గొనాలన్నారు. బాధిత ప్రజానీకానికి అందరూ సంఘీభావంగా ఉండాలని సూచించారు. పసుపు, కంద, నిమ్మ, అరటి, కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.













