ప్రకృతిని హ్యాండిల్ చేస్తున్నాం…
ప్రకృతిని హ్యాండిల్ చేయగలుగుతున్నాం కానీ, పొలిటికల్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాడు ఓ జాతీయ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే, ఇవాళ మరో పార్టీ సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోందని విమర్శించారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఐటీ దాడుల ద్వారా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిలో పోటీపడాలి తప్ప కక్ష సాధింపు వైఖరి సరికాదని తెలిపారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడగానే విభజన సమస్యలు చుట్టుముట్టాయన్నారు. ఓ వైపు విభజన కష్టాలు, మరో వైపు ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. అయినా పట్టుదలతో కలిసిగా పనిచేసి అధిగమిస్తున్నామని తెలిపారు. సాంకేతిక అభివృద్ధితోనే విపత్తులను అధిగమిస్తున్నామని చెప్పుకొచ్చారు.
హుద్ హుద్, టిట్లి తుపాన్లలో ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. టిట్లి తుపాన్ ఎక్కడ, ఎప్పుడు తీరం దాటుతుందో ఖచ్చితంగా అంచనా వేశామని చెప్పారు. ఇప్పుడు అధికారులు అవిశ్రాంతంగా పనిచేయాలని, బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు. చెరువు కట్టల పటిష్టం పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. పంట బీమా ప్రయోజనం బాధిత రైతాంగానికి అందించాలని సూచించారు. మిగిలిన లక్ష హెక్టార్లతో పంటనష్టం అంచనా పూర్తి చేయాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని, రేపు తాను వచ్చేలోగా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని అధికారులకు చంద్రబాబు నిర్దేశించారు.













