మాట నిలబెట్టుకోవడానికే నంద్యాలకు వచ్చా
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలోని స్థానిక టెక్క్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షానికి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం తప్ప మరేమీ అక్కర్లేదని విమర్శించారు. ప్రారంభించిన పనులు చూసి సమీక్ష చేసి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికే నంద్యాలకు వచ్చానని పేర్కొన్నారు. పార్టీ ప్రభుత్వం వేర్వేరు కాదని, నంద్యాల ఎన్నికలు సవాలుగా తీసుకుని సత్తా చాటామన్నారు. ట్రిపుల్ ఐటీ, ఓర్వకల్లు విమానాశ్రయం ఏమీ లేవని ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేసిన ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట వస్తున్న పార్టీలను ఆదరించొద్దని ప్రజలను కోరారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి వస్తుందన్నారు. వచ్చే నెల విత్తన హబ్ ప్రారంభోత్సవానికి మళ్లీ కర్నూలు జిల్లాకు వస్తానని తెలిపారు. ఇక్కడ విత్తనాలు తయారు చేసి ప్రపంచానికే సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ ఏడో తేదీన దీనికి శ్రీకారం చుడతామన్నారు.













