కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు : చంద్రబాబు
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ప్రజాదర్బార్ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కడప ఉక్కు ఉద్యమంలో బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో గాలి జనార్థన్ రెడ్డి అండ్ బృందం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అవినీతి పరులను కట్టడి చేయలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. అవినీతి పార్టీలన్నీ ఓ వైపు చేరాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సొంత మైక్‌లా, బీజేపీ అద్దె మైక్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీవారి నగల ప్రదర్శన చేయడం మంచిదికాదని పూజారులు చెబుతున్నారని, స్వామివారి ప్రతిష్ట దిగజార్చేలా రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రేపు సైకిల్ ర్యాలీలు, ఎల్లుండి ధర్నాలు చేపట్టాలన్నారు. ప్రజల్లో అవగాహనను పెంచి చైతన్య పరచాలన్నారు. అంగన్వాడీలు, హోంగార్డులు, వీఆర్ఏ జీతాలు పెంచామని, ఆశా వర్కర్ల జీతాల పెంపుపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ-వైసీపీ దొంగాటలు బయటపెట్టాలని, గాలి-జగన్-బీజేపీ లాలూచీ ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నెల 28న ఢిల్లీలో ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో ధర్నాలు కొనసాగాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరసన సెగ ఢిల్లీని తాకాలన్నారు. వైసీపీ ఎంపీలు ఉపఎన్నికలు తప్పించుకోటానికే రాజీనామా డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు.













