మెగా పారిశ్రామిక క్లస్టర్
అనంతపురం నుంచి కృష్ణపట్నం వరకు తమిళనాడు తరహా అతి పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటవుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్ క్లస్టర్ మొదలుకొని, అనంతపురము జిల్లాలోని ఆటోమొబైల్ పరిశ్రమ వరకు రానున్నకాలంలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా అవతరిస్తుందని తెలిపారు. తమిళనాడులోని ఇండస్ట్రియల్ క్లస్టర్ అత్యధిక వృద్ధితో దేశంలోనే ముందుందని, దాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, పి. నారాయణ, లోకేశ్, పితాని సత్యనారాయణలతో కలిసి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పటికే ఇసుజు, భారత్ ఫోర్జ్, అపోలో, కియా, హీరో వంటి దిగ్గజ ఆటోమొబైల్ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, ఒకవైపు హీరో, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు, మరోవైపు కియా వంటి సంస్థల ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతం దేశంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్ క్లస్టర్‌గా రూపుదిద్దుకోబోతోందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కియా మోటార్స్ అనుబంధ సంస్థలు 18 యూనిట్ల స్థాపనకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ఆయన ద ష్టికి తీసుకొచ్చారు. ఈ సంస్థలన్నీ కలిసి మొత్తం 761.2 మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని, మొత్తం 6,799 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలలో 80శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా నిబంధనలు విధించి వాటిని పటిష్టంగా అమలు చేయాలని, ఆయా పరిశ్రమల అవసరాల మేర రాష్ట్రంలోని యువతకు తగిన నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రోత్సాహకాల కాల వ్యవధిని 20 నుంచి 25 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ నిబంధనల కారణంగా సాఫ్ట్ లోన్ బదులుగా రీఫండ్ విధానాన్ని అనుసరించాలనే ప్రతిపాదనను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. సౌత్ కొరియాను అన్ని అంశాలలో బెంచ్ మార్కుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందఠంగా అధికారులకు సూచించారు. వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాలకు అనుగుణంగా ‘బిజినెస్ రిఫామ్స్ యాక్షన్ ప్లాన్-2017’ను ఉన్నతీకరించి ఏపీ ర్యాంకును విశాఖ సీఐఐ సదస్సులో సగర్వంగా ప్రకటించుకుందామని చెప్పారు.













