కేసీఆర్ అప్పుడు తెలంగాణను… ఇప్పుడు ఏపీని : చంద్రబాబు
తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ అన్నారు. మరి చేశారా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలుపుతామని కేసీఆర్ వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట నిలుపుకోలేదని విమర్శించారు. అప్పుడు తెలంగాణను మోసం చేశారని, ఇప్పుడు ఏపీని మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాకు సహకరిస్తామని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌లాంటి అవినీతిపరుడు, అసమర్థుడు సీఎం అయితే ఏపీ తమ గుప్పిల్లో ఉంటుందని కేసీఆర్ భ్రమపడుతున్నారని అన్నారు. జగన్‌కు ఓటేస్తే మన నీళ్లు మనకు రావని, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేసీఆర్ కబ్జా చేస్తారని విమర్శించారు.
పోలవరంపై కేసీఆర్ కూతురే కోర్టుకెళ్లిందని విమర్శించారు. జగన్‌కు ఓటేస్తే మనకు నీళ్లురావని, రాజధాని అగిపోతుందని, మన ఆస్తులు మనకు రాకుండా పోతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని సూచించారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్ పెత్తనాన్ని కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు. కేసీఆర్-జగన్ తోడుదొంగలని ఇప్పటికే రుజువైదన్నారు. ఏపీ ప్రజలు అప్రమత్తమై కళ్లు తెరచి ఓటేయాలన్నారు. నరేంద్ర మోదీకి కేసీఆర్, జగన్ పెంపుడు కుక్కలని, మోదీ వేసే బిస్కెట్ కోసం ఆశపడుతున్నారని విమర్శించారు.













