ఉపరాష్ట్రపతికి పనిష్మెంటా? ప్రమోషనా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోయారు. బీజేపీ హయాంలో దక్షిణాది రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. దక్షిణాది నుంచి ప్రస్తుతం ఏ ఒక్కరైనా కేంద్ర మంత్రిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. అన్యాయం చేసింది కాగా, తిరిగి తమనే విమర్శిస్తారా అని మండిపడ్డారు. దక్షిణాది నుంచి కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడు ఉండేవారు. వీళ్లు కోపంతో ఆయన్ను కూడా తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని చేసేశారు. అది పనిష్మెంటా.. ప్రమోషనా అనేది దేవుడికే తెలియాలి. దేశంలో దక్షిణాది భాగం కాదా? కాంగ్రెస్ హయాంలోనూ ఉత్తరాది వారు ప్రధానిగా ఉంటే దక్షిణాది వ్యక్తిని రాష్ట్రపతిగా ఉంచడం వంటివి చేసేవారు. ఈశాన్య రాష్ట్రాలతో సహా సముచిత స్థానం ఇచ్చి గౌరవించేవారు.
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయను పదవి నుంచి తొలగించారు. కర్ణాటక నుంచి ఉన్న అనంతకుమార్ మృతి చెందారు. ఒక్క సదానంద గౌడ మాత్రమే మిగిలారు. దక్షిణాదిలో ఎంతమంది మంత్రులకు ఎన్ని ఫోర్ట్ఫోలియోలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనోభావాలను ఎలా కాపాడతారు? ఉపన్యాసాలు ఎలా ఇస్తారు? దక్షిణాదిలో ఖాతా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గెలుస్తా అని చెబుతారు. ఎలా గెలుస్తారు? అశాస్త్రీయ విభజన జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఇంటింటికీ తిరిగాను. ప్రధాని మోదీ ఎక్కడికొస్తే అక్కడ కలిశాను. న్యాయం చేస్తారనే తిరిగాను. నాకోసం తిరగలేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరుతున్నా అని చంద్రబాబు అన్నారు.













